English | Telugu

శేఖర్‌ రెడ్డికి క్లీన్‌చిట్‌.. ఆధారాల్లేవని తేల్చిన సీబీఐ

పాతనోట్ల మార్పిడి వ్యవహారంలో తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త, టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌ రెడ్డికి సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆయనతోపాటు మరో ఐదుగురిపై నమోదైన కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని, అందువల్ల కేసును మూసివేయవచ్చంటూ సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో.. ఈ కేసులను కొట్టి వేస్తూ సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఎస్‌.జవహర్‌ తీర్పు వెల్లడించారు.

2016లో రూ.500, 1000 నోట్ల రద్దు సందర్భంగా శేఖర్‌ రెడ్డి కార్యాలయంతోపాటు ఆయనకు సంబంధించిన వివిధ నివాసాల నుంచి పోలీసులు భారీగా కొత్త నోట్లను, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శేఖర్‌ రెడ్డితోపాటు ఆయన సన్నిహితులు మరో ఐదుగురు వివిధ బ్యాంకుల అధికారుల ద్వారా పాత కరెన్సీని మార్చారంటూ అప్పట్లో పోలీసులు, ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. అధికారులతో కలిసి కుట్ర పన్నారని, రూ.247.13 కోట్ల మేర ప్రభుత్వాన్ని మోసం చేశారంటూ కేసు నమోదైంది.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సీబీఐ.. కోర్టులో తుది చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 170మంది సాక్షులను విచారించామని, ఎలాంటి ఆధారాలూ లభించలేదని, అందువల్ల ఆ ఎఫ్‌ఐఆర్‌ను మూసివేయాలని తుది చార్జ్‌షీట్‌లో సీబీఐ కోర్టుకు విన్నవించింది. దీంతో క్లీన్‌చిట్‌ తో శేఖర్‌ రెడ్డితోపాటు మరో ఐదుగురు బయట పడ్డారు.

కాగా, రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన సమయంలో.. దేశంలో సామాన్యుడికి కరెన్సీ దొరకడం ఎంత కష్టంగా మారిందో తెలిసిందే. కానీ, శేఖర్‌రెడ్డి ఇంట్లో మాత్రం.. కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. అప్పట్లో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఆ సమయంలో శేఖర్‌ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండటంతో.. ఈ డబ్బు అంతా చంద్రబాబుది అని, శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ వైసీపీ ఆరోపించింది. శేఖర్‌ రెడ్డిపై ఆరోపణలు రాగానే చంద్రబాబు, ఆయన్ని టీటీడీ బోర్డు నుంచి తొలగించారు. అయితే, శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ ఆరోపించిన వైసీపీ.. అధికారంలోకి రాగానే శేఖర్‌ రెడ్డికి మళ్ళీ బోర్డులో సభ్యుడిగా అవకాశం కల్పించింది. దీంతో అప్పుడు వైసీపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు బినామీ అంటూ ఆరోపించిన మీరే ఆయనకు టీటీడీ బోర్డులో అవకాశం ఎలా ఇచ్చారని జగన్ సర్కార్ తీరుని పలువురు తప్పుబట్టారు.

ఇదిలా ఉంటే, ఇంతకు ముందు శేఖర్‌ రెడ్డికి ఐటీ శాఖ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సొమ్మంతా వ్యాపారవాదేవీల్లో వచ్చిందని చెప్పింది. ఇప్పుడు ఎలాంటి ఆధారాలూ లేవంటూ సీబీఐ కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అయితే, శేఖర్‌ రెడ్డికి క్లీన్‌చిట్‌ రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత వ్యాపారం చేస్తే మాత్రం నోట్ల రద్దు సమయంలో.. కొత్త నోట్లు క్యాష్ రూపంలో కోట్లకు కోట్లు ఎలా వస్తాయి?. రెడ్ హ్యాండెడ్‌ గా కోట్ల విలువైన కొత్త నోట్ల కట్టలు, బంగారం దొరికితే ఆధారాలు లేవని చెప్పడం ఏంటి? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.