English | Telugu

షహీన్‌బాగ్ శిబిరాన్ని ఎత్తేసిన పోలీసులు

కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఢిల్లీ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక నిరసన శిబిరాన్ని తొలగించామని పోలీసులు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన సాయుధ పోలీసులు పొక్లెయినర్ల సాయంతో శిబిరాన్ని కూల్చివేసి లారీలో టెంటు, కుర్చీలు, ఇతర సామాన్లను తరలించారు.

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లులో వుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వందలాది మంది మహిళలు షహీన్‌బాగ్ శిబిరంలో నిరసన తెలుపుతున్నారు.

ఈ శిబిరంలో ఉన్న కొందరు మహిళలు ప్రతిఘటించినా పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకొని షహీన్‌బాగ్ నిరసన శిబిరాన్ని ఖాళీ చేయించారు. 144 సెక్షన్ ను ఉల్లంఘించారని 9మంది నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.