English | Telugu

ఉగాది నాడు ఇళ్ల స్థలాలు పంచొద్దు: ఎన్నికల సంఘం

ఉగాది రోజున ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ ఓటర్లను ప్రభావితం చేస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలను చేపట్టవద్దని సూచించింది. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

తమ ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని, ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణకు ప్రయత్నించినా చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా టెండర్ల ఆహ్వానం, టోకెన్ల పంపిణీ వంటి చర్యలు నిలిపివేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, స్థలాల గుర్తింపు, లబ్దిదారుల ఎంపిక వంటి కార్యక్రమాల్లో కూడా అధికారులు పాల్గొనరాదని రమేశ్ కుమార్ అన్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల కోడ్ కు విరుద్ధమని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని వైఎస్ జగన్ మాటిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ నవరత్నాల్లో ఒకటిగా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉగాది పర్వదినాన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వైఎస్సార్‌సీపీ సర్కారు మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రస్తుతం 11 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను అందించడానికి భూమి అందుబాటులో ఉంది. మరో 14 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియ ను కూడా వేగవంతం చేసింది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అమలును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం (రెవెన్యూ) అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం కోసం రెవెన్యూ శాఖ (ల్యాండ్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన మరో కమిటీని ఏర్పాటు చేశారు.జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షుడిగా, కలెక్టర్‌ కో–చైర్మన్‌గా మరో కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. సమన్వయ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్‌కు అప్పగిస్తారు.