English | Telugu
చిత్తూర్ జిల్లాలోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ! ఏకగ్రీవాల విషయంలో చంద్రగిరి టాప్
Updated : Mar 14, 2020
స్థానిక సంస్థల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చవిచూడాల్సి వస్తోంది. టిడిపి మినహా ఇతర ప్రతిపక్షాలను పెద్ద పోటీగా వైఎస్సార్సీపీ భావించడం లేదు. దీంతో ప్రధానంగా టీడీపీపై ఫోకస్ పెట్టి ఆ పార్టీని భారీగా దెబ్బతీస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ టీడీపీకి భారీగా ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే ఏకగ్రీవ జెడ్పీటీసీ -ఎంపీటీసీ స్థానాలు ఎన్నికయ్యాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి విశేష ప్రాధాన్యం ఇస్తారు. ఎన్ని ఏకగ్రీవాలు సాధిస్తే ఆ నియోజకవర్గంలో నాయకుడికి ఆ పార్టీకి అంత బలం ఉందని నిరూపించుకుంటుంటారు. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 24 జెడ్పీటీసీ స్థానాలు ఏక గ్రీవ ఎన్నికలు జరిగాయి. ఈ ఏకగ్రీవమైన 24 స్థానాల్లో 9 జెడ్పీటీసీ స్థానాలు చిత్తూరు జిల్లావే ఉన్నాయి.
ఏకగ్రీవాల్లో ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం టాప్ పొజిషన్లో ఉంటూ వచ్చింది. అక్కడ 65 ఎంపీటీసీ సీట్లు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యాయి. 71కి గానూ 65 సీట్లలో ఒకే నామినేషన్ దాఖలు కావడంతో.. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యాయి.
అయితే మాచర్ల ను మించింది చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉండేది ఈ నియోజకవర్గం పరిధిలోనే. అయితే అక్కడ ఏకంగా 76 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 95 ఎంపీటీసీలున్నాయట ఈ నియోజకవర్గంలో. వీటిల్లో 76 సీట్లకు సంబంధించి ఒకే ఒక నామినేషన్ మిగిలాయట. ఈ నేపథ్యంలో అత్యధిక ఏకగ్రీవాల విషయంలో చంద్రగిరి టాప్ పొజిషన్లో నిలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఏ స్ధాయిలో గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఇపుడు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అని స్ధానికులు నిజంగా భయపడ్డారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ విధమైన గొడవ జరగలేదు. ఏకగ్రీవం అయిన 76 ఎంపిటిసి స్ధానాల్లో కూడా గొడవలు జరిగిన దాఖలాలు లేవు.
తెలుగుదేశంపార్టీ నుండి ఎటువంటి పోటి లేకపోవటంతోనే ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. చంద్రబాబు సొంత ఊరైన నారావారిపల్లెలో కూడా ఎన్నిక వైసిపికి అనుకూలంగా ఏకగ్రీవమైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉండడంతో టీడీపీ పార్టీ నాయకులంతా పోటీకి జంకుతున్నారట.