English | Telugu
తండ్రీ కొడుకుల ట్వీట్లేవీ సతీష్ రెడ్డి ని ఆపలేకపోయాయి
Updated : Mar 10, 2020
మబ్బులు వీడినాయి. మొత్తానికి తాను టీడీపీని వీడుతున్నట్లు పులివెందుల టీడీపీ సీనియర్ నేత సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సరైన ఆదరణ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసిన సతీష్ కుమార్ రెడ్డి వేంపల్లె లోని తన సమావేశం లో ఈ ముఖ్య నిర్ణయం వెల్లడించారు. . మనసును చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. టీడీపీపై అసంతృప్తితోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని వర్గీయులకు, కార్యకర్తలకు సతీష్ తెలిపారు. కడపలో టీడీపీకి చాలా కీలకనేతగా సతీష్ వ్యవహరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెండుసార్లు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండుసార్లు సతీష్ రెడ్డి పోటీ ఇచ్చారు. వారి చేతిలో ఓటమి పాలైనప్పటికీ... పులివెందులలో బలమైన నేత కావాలి కాబట్టి టీడీపీ సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మండలి చైర్మన్ను చేసింది.
పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు భారీ షాక్ తప్పదని, పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ కాబోతోందని కథనాలు వెలువడ్డాయి. అయితే సతీష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ మారుతారని వార్తలు వస్తున్న తరుణంలో సతీష్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పులివెందుల రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
పార్టీ మారుతారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సతీష్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్లు చేశారు. ‘‘పులివెందుల గడ్డ మీద ప్రత్యర్థులపై అలుపెరుగని పోరాటం చేస్తూ, ప్రజలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం సైనికుడు.. ఎస్వీ సతీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మీరు కోరుకున్న విజయాలను అందుకోవాలని కోరుతున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘పులివెందుల తెలుగుదేశం నేత ఎస్వీ సతీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సకల సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. అయితే, తెండ్రీ కొడుకుల ట్వీట్లు ఏమీ సతీష్ కుమార్ రెడ్డి ని తెలుగు దేశం పార్టీ వీడకుండా ఆపలేకపోయాయి.