English | Telugu

సోనియా ఫ్యామిలీకి కరోనా పరీక్షలు... ఆర్ఎల్పీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కరోనా వైరస్ దేశంలో అలజడి సృష్టిస్తోంది. కరోనా భయంతో ప్రజలంతా వణికిపోతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 29 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్ సభలో ప్రకటన చేశారు. అయితే, కరోనా విస్తరించకుండా సకల జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. తెలంగాణలో ఇప్పటికే పదుల సంఖ్యల కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా, ఏపీలోనూ అనుమానితుల జాబితా పెరిగిపోతోంది.

కరోనాపై దేశంలో కలకలం రేగుతుంటే, లోక్ సభలో ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ తన వ్యాఖ్యలతో కల్లోలం సృష్టించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, అలాగే కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరారు. భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినవారిలో ఎక్కువగా సోనియా పుట్టినిల్లు ఇటలీ నుంచి వచ్చినవాళ్లేనని బీజేపీ మిత్రపక్షమైన ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ అన్నారు. అందువల్ల, సోనియా కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిన అవసరముందన్నారు.

ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ వ్యాఖ్యలతో లోక్ సభలో కలకలం రేగింది. హనుమాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ ను వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. హనుమాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.