English | Telugu

తెలంగాణ కాంగ్రెస్ అన్ని పదవుల్లో మార్పులు.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి?

తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కొన్ని రోజుల నుండి పీసీసీ మార్పు పైనే హాట్ హాట్ గా చర్చ నడిచింది. డిసెంబర్ మొదటి వారంలో మార్పు ఖాయమని ఏఐసీసీ ఇప్పుడే ఎవరికిస్తే బాగుంటుందో అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. పీసీసీ కోసం పార్టీలో అర్హత ఉన్న నాయకులందరూ వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ కంటే ముందు ఏఐసీసీ ఇంచార్జి మార్పు ఉంటుందనే చర్చ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో పీసీసీ కంటే ముందు ఏఐసీసీ ఇన్ చార్జి మారిస్తే బాగుంటుందనే వాయిస్ ని కొందరు నేతలు హైకమాండ్ దగ్గర వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో పీసీసీ కంటే ముందు ఇన్ చార్జ్ మార్పు ఉంటుంది అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తుంది.

అయితే ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జి స్థానంలో ఎవరిని నియమిస్తారనే అనే చర్చ మొదలైంది. కుంతియా ఇన్ చార్జిగా ఉన్నప్పటి నుండి పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేదన్న ఫీలింగ్ చాలా మంది నాయకుల్లో ఉంది. ఇప్పటికే ఏఐసిసి నుండి పీసీసీ వరకు అన్ని స్థాయిల్లో మార్పులు చేయాలని పార్టీ భావిస్తున్న తరుణంలో కుంతియాని కూడా మార్చుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎవరికి అవకాశమిస్తారో అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు పరిచయం ఉన్న నాయకుడు కాస్త ప్రభావితం చేయగలిగిన నాయకుడిని ఇన్ చార్జిగా పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.