English | Telugu

విధుల్లోకి రాకపోతే జీతం కట్.. ఆర్టీసీ యూనియన్ కార్యాలయాలు మూసివేత

తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులతో నేరుగా మాట్లాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ లో వారితో సమావేశం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఒక్కో డిపో నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 485 మందిని సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా కార్మికులు ఉండాలని అన్ని వర్గాల కార్మికులకు భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం నిర్దేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల లోపు కార్మికులను ప్రగతి భవన్ కు తీసుకు రావాలని సూచించారు. వారికి ప్రగతి భవన్ లోనే మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు. అనంతరం కార్మికులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాల పై కూలంకషంగా చర్చించనున్నారు. సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఆర్ఎంలు, డీవీఎంలను ఆహ్వానించారు.

మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం యూనియన్లకు షాకిచ్చింది. యూనియన్ల మాయలో పడి కార్మికుల బతుకులను చెడగొట్ట వద్దంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించిన మరుసటి రోజే యాజమాన్యం రంగంలోకి దిగింది. యూనియన్ కార్యాలయాలకు కేటాయించిన భవనాలకు తాళాలు వేసి స్వాధీనం చేసుకుంది. నేతలకున్న సదుపాయాలను రద్దు చేసింది. ఇక మీదట సంఘాల నేతలు కూడా విధులు నిర్వర్తించాల్సిందే.. లేదంటే వేతనాలు అందకపోగా అనధికారిక గైర్హాజరుగా పరిగణించాలని నిర్ణయించింది. సాధారణంగా ఆర్టీసీలో గుర్తింపు పొందిన యూనియన్ కేంద్ర కార్యాలయానికి బస్ భవన్ ఆవరణలో యాజమాన్యం భవన వసతి కల్పిస్తుంది. ఆ యూనియన్ నేతలకు వేతనంతో కూడిన సెలవులు ప్రయాణానికి రెడ్, బ్లూ వారెంట్ సౌకర్యాలు కల్పిస్తోంది. ఇలాంటి వాటన్నింటిని యాజమాన్యం రద్దు చేసింది.

ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గుర్తింపు పొందిన యూనియన్ గా ఉండేది. దీని గడువు 2018 ఆగస్టు 7వ తేదీతో ముగిసింది. ఈ యూనియన్ అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి , ఇలా మొత్తం 26 పోస్టులలోని నేతలకు వేతనంతో కూడిన సెలవుల వసతి కల్పించింది. ఎంప్లాయిస్ యూనియన్ కు చెందిన ముగ్గురు నేతలకు ఖమ్మం రీజియన్ లో గెలుపొందిన ఎస్డబ్ల్యూఎఫ్ నేతకు ఈ వసతి కల్పించింది. ఇలా మొత్తం 30 మంది యూనియన్ నేతలకు విధులు నిర్వహించక పోయినా వేతనాలిచ్చే అవకాశాన్ని కల్పించారు. అలాగే గుర్తింపు పొందిన టీఎంయూ జోనల్ సెక్రటరీలకు వారంలో 3 రీజినల్ సెక్రెటరీలు డిపో సెక్రటరీలకు వారంలో ఒకటి చోప్పున ప్రీ మస్టర్ సౌకర్యాన్ని కల్పించారు. శుక్రవారం ఈ సెలవులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కార్మిక నేతలు ఇకపై విధుల్లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేసింది. టీఎంయూ కేంద్ర కార్యాలయానికి తాళం వేసింది.