English | Telugu
పరిమళ్ రాజ్యసభ సభ్యత్వం వెనుక పరిమళించిన క్విడ్ ప్రో కో ఏంటి?
Updated : Mar 10, 2020
రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్ధులను ముఖ్యమంత్రి, వైసీపీ అద్యక్షుడు జగన్ ఖరారు చేశారు. శాసన మండలి రద్దు గురించి పట్టుదలగా ఉన్న జగన్ మండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోతున్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ స్థానాలు ఖరారు చేశారు. వీరితో బాటు తనకు అత్యంత నమ్మకస్తుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త, తన ఆదాయ వనరుల పెరుగుదలలో ఒక పాత్ర పోషించిన అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభకు పంపి న్యాయం చేశారు.
ఇక మిగిలిన నాలుగో స్థానంలో కేసిఆర్ బాటలో నడుస్తున్న జగన్ ఆయనలానే కుటుంబసభ్యులకు ప్రాధాన్యమిస్తూ.. చెల్లెలు షర్మిలకు అవకాశం ఇస్తారని అందరూ భావించినా అందుకు భిన్నంగా కొత్త అభ్యర్ధిని, రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని ఖరారు చేశారు. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో సమావేశం సందర్భంగా ముఖేష్ అంబానీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టిక్కెట్ ప్రతిపాదన ఆయన ముందు ఉంచారు. పారిశ్రామికవేత్త ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అయిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ స్థానం కేటాయించాల్సిందిగా ముఖేష్ జగన్ ను కోరారు. తనకు మూడు రోజుల సమయం ఇస్తే ఆలోచించి చెబుతాన్న జగన్ బాగా ఆలోచించి తన చెల్లెల్ని కాదని పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇంతవరకూ అందరికీ తెలిందే..ఇక్కడే కొందరు రకరకాల కొత్త ప్రశ్నలు లేవదీస్తున్నారు.
తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణంలో రిలయన్స్ పాత్ర ఉందని అప్పట్లో తన పత్రికలో, చానల్లో కధనాలు రావడమే కాకుండా అప్పట్లో వైసీపీ కార్యకర్తలు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసిన విషయం కూడా అందరికీ తెలుసు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం ఆ కేసులను ఉపసంహరించుకుంది కూడా. ఇప్పుడు అదే సంస్థ అధినేత సిఫారసుతో రిలయన్స్ కార్పోరేట్ దిగ్గజుడైన పరిమళ్ నత్వానీని వైసీపీ నుంచి రాజ్యసభకు పంపడం చర్చనీయాశం అయింది. ఇప్పటికే క్విడ్ ప్రో కో కేసుల్లో ఉన్న జగన్ ఈ డీల్ ఊరికే కుదుర్చుకుని ఉండడని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడే కొంత మంది ఒక అడుగు ముందుకేసి కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. చరిత్రలో తండ్రి బతికుండగా ఏ కొడుకూ రాజకీయంగా అంతగా రాణించలేదని జగన్ కూడా ఆ కోవకే చెందుతారనీ, అందుకే తండ్రి మరణానికి కారకులని ముద్ర వేసిన సంస్థకు చెందిన వ్యక్తికి పదవి కట్టబెట్టి, కేసులు చుట్టి పెట్టి.. తాను ముఖ్యమంత్రి అవ్వడానికి పరోక్షంగా సాయపడినందుకు ఋణం తీర్చుకున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతి పక్షం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది కూడా. మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయాన్ని జగన్ మరో మారు నిజం చేశారు.