English | Telugu

సీఏఏను వ్యతిరేకించేవారిని అణ‌చ‌డానికే ఢిల్లీ దంగా! మైనారిటీస్ కమిషన్ నివేదిక‌

పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక నిరసనలను చల్లార్చడానికే దిల్లీలో అల్లర్లను చేయించారని దిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడేందుకు కొన్ని వారాలుగా ఏర్పాట్లు జరిగాయని, ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ వరకూ దిల్లీలో జరిగిందంతా 'ఏక పక్ష దాడి' అని జఫారుల్ ఇస్లామ్ ఖాన్ బిబిసికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. 50 ఇళ్లు ఉన్న వరుసలో కేవ‌లం మార్కింగ్ చేసి ఐదు ఇళ్లను తగులబెట్టడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

''30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులు ముఖాలు దాచుకునేందుకు హెల్మెట్లు ధరించి ఈశాన్య దిల్లీపై పడ్డారు. అక్కడే 24 గంటలపాటు ఉండి, విధ్వంసానికి పాల్పడ్డారు. మనుషుల్ని చంపారు.
ఇళ్లను, దుకాణాలను లూఠీ చేశారని మైనారిటీస్ క‌మిష‌న్ తెలిపారు. త‌మ బృంధం ఈశాన్య దిల్లీని సందర్శించిన తర్వాత మార్చి 2న మైనార్టీస్ కమిషన్ ఓ నివేదిక విడుదల చేసిందని, అలర్లకు పాల్పడేందుకు దాదాపు 2000 మంది అక్కడికి వచ్చారని అందులో పేర్కొన్నారు..

పార్లమెంటులో ప్రతిపక్షానికి బదులిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా 300 మంది బయటి వ్యక్తులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చి, దిల్లీ అల్లర్లలో పాల్గొన్నారని అన్నారు. ఈ అల్లర్ల వెనుక సీఏఏ వ్యతిరేక నిరసనకారుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలను దిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ కొట్టిపారేశారు.

దిల్లీ జనాభాలో 12-13 శాతం ఉన్న ముస్లింలు, అల్లర్లలో నష్టపోయినవారిలో మాత్రం 90 శాతం ఎందుకు ఉన్నారో అమిత్ షా ఆలోచించుకోవాలని జఫారుల్ అన్నారు.