English | Telugu

వడ్డీ రేట్ల తగ్గింపు, లోన్ల‌పై 3 నెలల మారిటోరియం!

ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత కూడా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని... ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన కీలక నిర్ణయాలను తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ రేపో రేటును 75 బేసిక్ పాయింట్లు తగ్గించడంతో పాటు.... రివర్స్ రెపో రేటును 90 పాయింట్లకు కుదించింది.

ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్నాయని, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రజల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. ప్ర‌స్తుతం 3.74 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు.

అన్ని రకాల లోన్లుపై 3 నెలల మారిటోరియం ప్రకటించారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదని, ఇప్పుడు కట్టాల్సిన లోన్లు తర్వాత కట్టుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈఎంఐలు కట్టకపోయినా సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం ఉండదని గవర్నర్‌ తెలిపారు.

ఇక ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాల‌తో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐలో పని చేసే 150 మంది ఉద్యోగులు క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.