English | Telugu

ఆగని రైతు ఉద్యమం... వందల సంఖ్యలో జియో సెల్ టవర్ల ధ్వంసం

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులు తాజాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీపై యుద్ధానికి దిగారు. రిలయన్స్‌ జియోకు చెందిన 1338 సిగ్నల్‌ టవర్ల సైట్లను ధ్వంసం చేశారు. గడచిన 24 గంటలలోనే 151 టవర్లను, అవి ఉన్న సైట్లను కొంత మంది ఆందోళనకారులు నాశనం చేసినట్లు పంజాబ్ ప్రభుత్వమే ప్రకటించింది. "ఢిల్లీ శివార్లలో, పంజాబ్‌లోని చాలా చోట్ల నిరసనల్లో రైతులు సంయమనం పాటిస్తున్నారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. మీ చర్యల వల్ల ఫోన్‌ కనెక్టివిటీ పోతోంది.. ఫలితంగా ప్రజల దైనందిన జీవితానికి ఆటంకం కలుగుతోంది. పిల్లల చదవుకు.. ఇంటి నుంచి పని చేసే టెకీలకు ఈ చర్యలతో నష్టం వాటిల్లుతుంది. అంతేకాక కొవిడ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో ఇలాంటివి అవాంఛనీయం" అని సీఎం అమరిందర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. ఎక్కడికక్కడ టెలికాం లైన్లను, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే వీరంతా రైతులేనని చెప్పలేమని, వీరిలో కొందరు అరాచకవాదులు కూడా కలిసి ఈ అరాచకానికి పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. వీరు ముఖ్యంగా రాత్రివేళల్లో ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కత్తిరించేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు.

పంట ఉత్పత్తుల సేకరణ, పంపిణీ మొదలైన విషయాలతో దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ గ్రూపులకు ఎలాంటి సంబంధమూ లేకపోయినా.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగుచట్టాల వల్ల ఆ ఇద్దరి కంపెనీలకూ భారీగా లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయాలతో కొందరు వ్యక్తులు ఈ విధ్వంసకాండకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ చట్టాల సహకారంతో కార్పొరేట్లు తమ భూములను లాగేసుకుంటాయని ఆందోళన చెందుతున్న రైతులు ఆ కార్పొరేట్లకు ప్రతినిధులుగా అంబానీ, అదానీలను భావిస్తున్నారు.

మరోపక్క ఒక్క రోజులో 200 కు పైగా ప్రదేశాలలో నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడం వల్ల కనెక్టివిటీ తెగిపోయిందని, ఈ సైట్లలో సుమారు రూ.40కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రిలయన్స్‌ జియో పేర్కొంది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో రైతుల పేరిట కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, తగిన భద్రతనివ్వాలని రిలయన్స్ అధికారులు 23వ తేదీనే పంజాబ్‌ డీజీపీకి లేఖ రాయడంతో ఆయన పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేశారు.

ఇది ఇలా ఉండగా రైతుల ముసుగులో కొంత మంది అరాచకవాదులు ఈ దురాగతాలు చేస్తున్నారని పంజాబ్‌లో అతి పెద్ద రైతు సంఘం భారతీయ కిసాన్‌ యూనియన్ ‌(ఉగ్రహాన్‌) పేర్కొంది. "జియోను బహిష్కరించాలని, ఆ సిమ్‌లు వాడవద్దని మాత్రమే పిలుపునిచ్చాం తప్ప నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయమని కోరలేదని, రైతులు కూడా అలా చేయరని" పేర్కొంది.

మరోపక్క నిన్న ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమం ప్రసారమవుతున్నపుడు రైతులు తాము భోజనం చేసే పళ్లాలను మోగిస్తూ.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినదించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరానికి చివరిసారిగా మోదీ తన మన్‌కీ బాత్‌ను వినిపించినా అందులో అయన రైతుల గురించిన ఎటువంటి ప్రస్తావన చేయలేదు. మరోపక్క రైతులు మాత్రం "మోదీ తన మనసులో మాటల్ని చెప్పడం కాదు... మా మనసుల్లో మాట వినాలి" అని రైతు నేతలు వ్యాఖ్యానించారు. "మోదీ మాటలు వినీ వినీ రైతులు విసిగెత్తి పోయారు. చెప్పిన మాటలే చెప్పడం, రైతులపై అభాండాలు వేయడం ఆయనకు పరిపాటయ్యింది. అందుకే ఈ నిరసన" అని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ అన్నారు.