English | Telugu

సొంత జిల్లాలో వరాలు కురిపించిన సీఎం జగన్

సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన సొంత నియోజక వర్గం పులివెందులతో ముగిసింది. తండ్రి చనిపోయిన తరువాత తనకు ధైర్యం చెప్పి అండగా ఉన్న కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందంటూ అనేక వరాలు కురిపించారు వైఎస్ జగన్. ముఖ్యమంత్రి పర్యటనలో చివరి రోజు క్రిస్మస్ కావడంతో పులివెందుల సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు.

పులివెందుల నియోజకవర్గానికి 26 పథకాలకు సంబంధించిన పదమూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పులివెందుల మినీ సచివాలయానికి 10 కోట్లు, ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్ కోసం 20 కోట్ల రూపాయల కేటాయిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కేవలం తొలి విడతగానే నిధులను మంజూరు చేశామని రాబోయే రోజుల్లో పులివెందుల నియోజక వర్గ అభివృద్ధికి చాలా చేయాల్సి ఉందన్నారు ముఖ్యమంత్రి.

మరో దఫా పర్యటనకు వచ్చినప్పుడు గండికోట దిగువన 20 టీఎంసీల సామర్థ్యంతో మరో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. పులివెందుల్లో నిరుపయోగంగా మారిన అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు జగన్. మొత్తం మీద సీఎం జగన్ మూడు రోజుల పాటు జమ్మలమడుగు, కడప, మైదుకూరు, రాయచోటి, పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గాల్లో తనదైన మార్క్ వేసేలా కడప స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి కడప వాసులకు తన తండ్రి వైఎస్ఆర్ ను గుర్తు చేశారు. మొత్తం మీద జగన్ అక్కడి వాసులకు తన పర్యటనతోనే కాకుండా తన వరాలతో కూడా కనువిందు చేశారు.