English | Telugu

మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటీషన్లు.. మళ్లీ బ్రేక్ పడనుందా?

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి తెలంగాణలో వాతావరణం హీటెక్కింది. అడ్డగోలుగా వార్డుల విభజన, అస్తవ్యస్తంగా కులాల పరంగా ఓటర్ల గణన ఇవన్నీ గతంలో వచ్చిన అభ్యంతరాలు. 70 మునిసిపాలిటీలపై దాఖలైన పిటిషన్ లలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అభ్యంతరాలన్నీ పరిష్కరించాకే ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఆదేశించింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. అభ్యంతరాలు పరిష్కరించినట్టు పేర్కొంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ఇప్పుడే అసలు వివాదం మొదలైంది. వార్డుల రిజర్వేషన్ లు ఖరారు కాకుండా ఎలా షెడ్యూలు విడుదల చేస్తారన్న దాని పై మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందనేది మరో విమర్శ.

అభ్యంతరాలను పరిష్కరించకపోవడం , రిజర్వేషన్ లు ఖరారు చేయకుండా షెడ్యూలు విడుదల చేయడాన్ని విపక్షాల తప్పుపడుతున్నాయి. దీని పై మరోమారు హైకోర్టు మెట్లెక్కేందుకు రాజకీయ పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. మరి కొన్ని పిటిషన్ లు దాఖలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే షెడ్యూల్ విడుదలయ్యాక కోర్టు ఇలాంటి పిటిషన్ లను పరిగణలోకి తీసుకోవద్దని వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పుడు షెడ్యూల్ మాత్రమే విడుదలైందని నోటిఫికేషన్ వస్తేనే కోర్టులు జోక్యం చేసుకోలేవు అన్నది మరో వాదన. వచ్చే నెల 7న నోటిఫికేషన్ రానుండటంతో ఆలోపు హైకోర్టులో విచారణ జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ముందు ముందు తెలంగాణ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అన్నది వేచి చూడాలి.