English | Telugu
తెలంగాణ ఆర్టీసీలో భారీ మార్పులు... ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యం...
Updated : Dec 26, 2019
టీఎస్-ఆర్టీసీ ప్రక్షాళన మొదలైంది. ఎవరెక్కడ పనిచేస్తున్నారో... వారికిచ్చే వేతనానికి తగ్గ పని చేస్తున్నారో లేదో... తెలుసుకునేందుకు ఎంక్వైరీ ప్రారంభించారు. అలాగే, ఏ విభాగంలో ఎవరెవరు ఎందరున్నారో తెలుసుకోవడానికి కసరత్తు జరుగుతోంది. ఆర్టీసీలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. ఆర్టీసీ సమ్మె తర్వాత టికెట్ ధరల పెంపుతో ఇప్పటికే సంస్థ ఆదాయం పెరగగా, ఇప్పుడు మరిన్ని చర్యలతో సమూల ప్రక్షాళన చేసేందుకు అడుగులు వేస్తున్నారు. కొన్ని విభాగాల్లో అసలే పనే లేకపోవడం... సిబ్బంది ఖాళీ ఉన్నట్లు గుర్తించారు. అలాగే, కొన్ని విభాగాల్లో పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. దాంతో, సిబ్బందిని సమతుల్యం చేసి అందరికీ సమానంగా పని ఉండేలా సర్దుబాటు చేయనున్నారు. మొదట డిపో స్థాయిలో సిబ్బందిని సర్దుబాటుచేసి ఆ తర్వాత అనుబంధ విభాగాలపై దృష్టిపెట్టనున్నారు. అలాగే, అవసరం లేని విభాగాలను తొలగించనున్నారు.
తెలంగాణలో మొత్తం 97 డిపోలు ఉండగా, కొన్ని డిపోలకు అవసరానికి మించి ఎక్కువ బస్సులను కేటాయించారు. దాంతో, అవన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. అయితే, ఇప్పుడు 800 బస్సులను తగ్గిస్తుండటంతో రేషనలైజేషన్ కానున్నాయి. అలాగే, కండీషన్ లో లేని మరో 400 డొక్కు బస్సులను కూడా తొలగించనున్నారు. బస్సులను తగ్గించడం ద్వారా డిపోల్లో సిబ్బంది అవసరం తగ్గనుంది. అదే సమయంలో డిమాండ్ ఎక్కువున్న డిపోలకు ఎక్కువ బస్సులను... తక్కువ డిమాండున్న డిపోలకు తక్కువ బస్సులు ఉండేలా హేతుబద్ధీకరించనున్నారు. ఆయా డిపోల్లో పనిలేని వాళ్లను గుర్తించి మరో చోటకి పంపించనున్నారు. ఇక అద్దె బస్సులకు డ్రైవర్లు, మెకానిక్ లను వాటి యాజయానులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున ఆర్టీసీపై భారం తగ్గనుంది. హేతుబద్ధీకరించిన తర్వాత కూడా సిబ్బంది మిగిలిపోతే వాళ్లను సరుకు రవాణా విభాగానికి పంపనున్నారు.
ఇక, మియాపూర్లో ఉన్న బస్ బాడీ వర్క్ షాప్ భారంగా మారడంతో దాన్ని కూడా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, హకీంపేట, వరంగల్ శిక్షణా కేంద్రాలను కూడా మూసేయాలన్న ఆలోచన చేస్తోంది. మొత్తంగా సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకుని... ఆదాయం పెంచుకోవడంపై దృష్టిపెట్టిన ఆర్టీసీ యాజమాన్యం... సాధ్యమైనంత త్వరగా సంస్థను లాభాల్లోకి తీసుకురావాలనుకుంటోంది. ఆర్టీసీ ప్రక్షాళనపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టడంతో సంస్థ గాడిలో పడే అవకాశం కనిపిస్తోంది.