English | Telugu
మూడు రాజధానుల నిర్ణయంపై రెండు లక్షల మంది ఇచ్చిన తీర్పు
Updated : Dec 21, 2019
ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. మూడు రాజధానుల అంశమనే చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులని వ్యాఖ్యలు చేయడం. ఆ వ్యాఖ్యలకు తగ్గట్టే జీఎన్ రావు కమిటీ నివేదిక ఉండటంతో.. ఏపీకి మూడు రాజధానులు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈ మూడు రాజధానుల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. కొందరు మాత్రం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు పార్టీలకతీతంగా జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైసీపీ కార్యకర్తలు సైతం.. పార్టీ కార్యాలయానికి నల్లరంగు వేసి నిరసన వ్యక్తం చేసారు. మేము ముందు ఈ ప్రాంత రైతులం, ఆ తర్వాతే మాకు పార్టీ అని స్పష్టం చేసారు. మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మొత్తానికి జగన్ నిర్ణయం కొందరికి ఇష్టం, కొందరికి కష్టం అన్నట్టుగా ఉంది.
ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని... 'తెలుగువన్' యూట్యూబ్ ఛానెల్ లో ఓ పోల్ పెట్టింది. రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని భావిస్తున్నారా?అని క్వశ్చన్ అడిగింది. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపు రెండు లక్షల మంది ఈ పోల్ లో పాల్గొన్నారు. 43 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. 57 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంటే మెజారిటీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అర్థమవుతోంది. ఈ పోల్ కి వెయ్యికి పైగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ కామెంట్స్ లో కూడా మెజారిటీ శాతం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కామెంట్స్ రావడం గమనార్హం. ఇది పనికిమాలిన చర్య అని కొందరు అంటే.. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పొతే రాష్ట్ర మనుగడకే ప్రమాదమని కొందరు కామెంట్స్ చేశారు. ముందు.. ఉన్న రాజధాని నగరం అమరావతిని డెవలప్ చేయండి చాలు.. మీరిలా మూడు రాజధానులు అంటే ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా పోయే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా రెండు లక్షల మంది పాల్గొన్న ఈ పోల్ ని గమనిస్తే మాత్రం.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని అర్థమవుతోంది.