English | Telugu

ఆంధ్ర‌-తెలంగాణా మ‌ధ్య మ‌ళ్ళీ చిచ్చు! పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై ర‌గ‌డ‌!

తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు పంచాయితీ ముదురుతోంది. గతంలోనే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్‌ పూనుకోవడం, దానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం జరిగాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లడంతో మరోసారి ఇది చర్చనీయాంశమైంది.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం డిసెంబరులోనే నిర్ణయించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు విషయంలో తమ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవద్దని బోర్డు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఇదేమీ పట్టించుకోకుండా ప్రాజెక్టు విస్తరణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తెలంగాణ నీటి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయన్న ఆందోళన ఉంది.

ప్రస్తుతం పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల క్యూసెక్కులుగా ఉంది. ఈ సామర్థ్యంతోనే ఏపీ భారీగా శ్రీశైలం నీటిని తరలిస్తుందనే ఆరోపణలున్నాయి. దీని సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడం ద్వారా మరింత నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అదే జరిగితే శ్రీశైలంపై ఆధారపడ్డ తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందనే ఆందోళన ఉంది.