English | Telugu

మినరల్ వాటర్ ప్రజల రోగాలకు స్టాటర్

బావిలో నీరు తాగే రోజుల నుంచి బాటిల్లో నీళ్లు తాగే రోజులకు వచ్చేసారు ప్రజలు. మినరల్ వాటర్ లేనిదే గొంతులోకి నీళ్లు దిగటంలేదు. అసలు మనం తాగే నీరు ఎంత వరకు సురక్షితం..! మినరల్ వాటర్ మంచిదేనా..!? లేక డబ్బులు పెట్టి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నామా?? వాటర్ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మినరల్ వాటర్ ఎంతో సురక్షితమని ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిళ్లు కోనుకొని తాగేస్తాం. ఆ నమ్మకమే వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వాటర్ ప్లాంట్లు దర్శనమిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి.. వాల్టా చట్టాన్ని కాళరాసి..మినరల్ వాటర్ మాఫియా వ్యాపారం మూడు బోర్లు ఆరు ట్యాంకర్ లు అనే విధంగా మారింది.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట్ ప్రాంతంలో బోరు నీళ్ళని బాటిళ్ లలో నింపుతున్నారు.బల్కంపేట లో మెజార్టీ ప్రజలకు నీటిని అమ్ముతున్న వాటర్ బాటిల్ యూనిట్ లో బాటిళ్లకు నీరు నింపడం మొదలు.. సీల్ వేసే క్యాప్ ను చూస్తే వంద శాతం బ్యాక్టీరియా కనిపిస్తుంది.క్యాన్లలో పడుతున్న పైపు బాటిళ్లను ఒకసారి పరిశీలిస్తే ఎంత అశుభ్రంగా ఉన్నాయో తెలుస్తుంది.కనీస ప్రమాణాలు పాటించకుండా.. తాము మిగిలిన వారికంటే ఎక్కువ శ్రద్ధతో నీటిని విక్రయిస్తున్నామని కొందరు వ్యాపారులు సమర్ధించుకుంటున్నరు.వీళ్లు తయారు చేసే వాటర్ బాటిళ్లలో అసలు ఏది నకిలీ.. ఏది ఒరిజినల్.. అనేది తెలీడం లేదు. అన్ని బాటిళ్లు బ్రాండెడ్ లాగానే కనిపిస్తాయి.. కానీ లోపల నీరు ఎన్ని రోజులు వాడొచ్చు అనే విషయంపై ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. పెద్ద పెద్ద హోటళ్ల పరిస్థితి కూడా ఇంతే..ఇక రైల్వేస్టేషన్ , బస్ స్టాండ్ ప్రాంతాల్లో డూప్లికేట్ బ్రాండ్ తో యధేచ్ఛగా వాటర్ బాటిల్స్ దందా కొనసాగుతోంది. అవి తాగి జనం అనారోగ్యం పాలవుతున్నారు. అయితే రద్దీ ప్రాంతాల్లో తాము బ్రాండెడ్ నీటినే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు అధికారులు. ఏదేమైనా ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. బాటిల్ మీద సగం లాభం వస్తున్నప్పుడు ప్రజల గురుంచి పట్టించుకునే అవసరం వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటున్నారు ప్రజలు.