English | Telugu

దొంగ కోసం ధర్మం వీడను! వైసీపీలో బోస్ లేఖ కలకలం

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. తోట త్రిమూర్తులు లక్ష్యంగా హోంమంత్రి సుచరితకు వైసీపీ రాజ్యసభ ఎంపీ సుభాష్‌చంద్రబోస్‌ రాసిన లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీలో రచ్చగా మారడంతో తన లేఖపై ఎంపీ బోస్ క్లారిటీ ఇచ్చారు. తోట త్రిమూర్తులపై హోంమంత్రి సుచరితకు రాసిన లేఖ పూర్తిగా తన వ్యక్తిగతమని ఎంపీ సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. ఇందులో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తారు.. కానీ కేసుకు సంబంధించిన లేఖ పూర్తిగా బాధితుల కోణంలో నుంచి రాసిందని చెప్పుకొచ్చారు. ఇది పార్టీకి ఏ మాత్రం సంబంధంలేని విషయమని వెల్లడించారు సుభాష్‌చంద్రబోస్.

రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దళిత యువకుల శిరోముండనం కేసులో హోంమంత్రికి సుచరితకు లేఖ రాశారు బోస్. దళిత యువకులకు శిరోముండనం కేసులో పీపీని మార్చమని తోట త్రిమూర్తులు కోరడంలో నైతిక ధర్మం లేదన్నారు. శిరోముండనం కేసుకు.. రాజకీయ పార్టీలకు సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. తోట త్రిమూర్తులు వైసీపీలోకి వచ్చినంత మాత్రాన దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని స్పష్టం చేశారు బోస్. గత 23 సంవత్సరముల నుంచి తాను దళితుల వెంటే తానున్నాని చెప్పుకున్నారు. ఈ కేసు దళితుల ఆత్మగౌరవానికి సంబంధించినదన్న బోస్.. శిరోముండనం కేసు విషయంలోనూ దళితుల వెంటే ఉంటానని తేల్చి చెప్పారు.

రాజకీయ పార్టీ అంటే రైల్వే జనరల్ బోగీ లాంటిదన్నారు ఎంపీ బోస్. ఈ బోగీలో దొంగ, దొర కూడా ఎక్కుతారు.. దొంగ ఎక్కినంత మాత్రాన రైలు నుంచి దొర దిగిపోలేడు కదా? ఈ కేసులో ఉన్న వ్యక్తి పార్టీలోకి వచ్చినప్పుడు ఆయనను వెనకేసుకుని వెళ్లవలసిన అవసరం పార్టీకి లేదని చెప్పారు. వ్యక్తిగత కేసు పార్టీకి సంబంధం లేదన్నారు. ముఖ్యంగా వైసీపీకి దళితులే పునాదని.. అటువంటి దళితులకు ఎవరు అన్యాయం చేసినా వదలబోనని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఇటువంటి విషయాలు ఒప్పుకోరని, చట్టం తాను పని తాను చేసుకుని పోతుందని ఎంపీ సుభాష్ చంద్ర బోస్ క్లారిటీ ఇచ్చారు.

దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని పిల్లి సుభాష్‌ కోరారు. దళితుల శిరోముండనం కేసులో ఏ1గా తోట త్రిమూర్తులు ఉన్నారని అందులో పేర్కొన్నారు. 20 ఏళ్లుగా కేసు తేలకుండా త్రిమూర్తులు పలుకుబడితో తెలివిగా వ్యవహరిస్తున్నారని, కేసు విచారణకు రాకుండా వాయిదా వేయించుకుంటున్నారని తెలిపారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దళిత సామాజికవర్గానికి చెందిన బాధితులు త్రిమూర్తులుతో పోరాడే స్థాయి లేని నిస్సహాయులని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలో ప్రస్తావించారు.

హోంమంత్రి సుచరితకు బోస్ రాసిన ఈ లేఖే ఇప్పుడు దుమారం రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ రచ్చగా మారింది. దొంగ అంటూ తోట త్రిమూర్తులును ఉద్దేశించే బోస్ రాశారని ప్రచారం జరుగుతోంది. దళితుల శిరోముండనం కేసులో ఏ1గా తోట త్రిమూర్తులు ఉన్నారని డైరెక్టుగా చెప్పేశారు బోస్. అంతేకాదు 20 ఏళ్లుగా కేసుల నుంచి త్రిమూర్తులు తప్పించుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బోస్. దశాబ్దాలుగా తోట, బోస్ మధ్య రాజకీయ విభేదాలున్నాయి. తోట టీడీపీలో ఉండగా బోస్ కాంగ్రెస్ లో ఉన్నారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు.. జగన్ సీఎం అయ్యాకా అధికార పార్టీలో చేరారు. తోట చేరిక బోస్ ఇష్టం లేకున్నా... జగన్ సూచనతో ఆయన అంగీకరించారని చెబుతున్నారు. బోస్ మంత్రిగా ఉన్నప్పుడు విభేదాలు బయటపడకున్నా.. ఆయన ఎంపీగా వెళ్లాక మాత్రం రెండు వర్గాల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దళితుల శిరోముండనం ఘటన తర్వాత తీవ్రమయ్యాయి. తోటకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేసిన ఘటన కూడా జరిగింది.

తాజాగా తోటను టార్గెట్ చేస్తూ ఎంపీ సుభాష్ చంద్ర బోస్ రాసిన లేఖతో వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. బోస్ లేఖ పార్టీలో కలకలం రేపుతుండటంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. వారి సూచన మేరకే తన లేఖపై బోస్ క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.