English | Telugu

మానవాళికి శుభవార్త.. మరో అడుగు దూరంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ 

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఇటు సామాన్యులకు అటు ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థ సంయుక్తంగా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ తొలి రెండుదశల ట్రయల్స్ నూ విజయవంతంగా పూర్తి చేసుకోవడం తో ప్రపంచ మానవాళి ఆనందం లో ఉంది. గత ఏప్రిల్ నెల లో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం కాగా, మొదటి రెండు దశల ట్రయల్స్ ఫలితాలు రెండు వారాల క్రితం విడుదల అయ్యాయి. తాజాగా మూడవ దశ ట్రయల్స్ జరుగుతుండగా, అవి కూడా విజయవంతం అవుతున్నట్టుగా తెలుస్తోంది.

మూడవ దశలో పెద్దఎత్తున వాలంటీర్లను సెలెక్ట్ చేసుకుని వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఐతే ముందుగా అందుతున్న ప్రాథమిక ఫలితాల ప్రకారం, ఆ వాలంటీర్ల శరీరంలో కరోనాను ఎదుర్కొనే నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ఫేజ్ 3 లో వచ్చిన డేటా పరిశీలించి దాని ఆధారంగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీకి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రపంచానికి తాము హామీ ఇచ్చిన విధంగా బిలియన్ డోస్ లను అందించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెపుతోంది. ఈ వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా మార్కెట్లోకి అందించాలని కృషి చేస్తోంది. ఐతే ఈ వైరస్ కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వదిలి పెట్టకపోవచ్చని ఆరోగ్య రంగంలోని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రావాలని మానవాళి మొత్తం కోరుకుంటోంది.