English | Telugu
తొడ కొట్టి మరీ వైసీపీ నేతలకు సవాల్ విసిరిన తాత!!
Updated : Mar 12, 2020
ఏపీలో స్థానిక సంస్థల పోరు హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాలలో అధికార పార్టీ శ్రేణులు.. ఇతర పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. నామినేషన్ పేపర్లు చించివేయడం, మారణాయుధాలతో దాడులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విపక్ష పార్టీలకు చెందిన వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడ్డారు. పలువురు నామినేషన్ టైం కి వెనకడుగు కూడా వేశారు. అయితే ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు చూపించిన తెగువ మాత్రం అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేస్తుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీకి చెందిన అంజిరెడ్డి అనే తాత చూపిన తెగువ.. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, ధైర్యం నింపేలా ఉందని టీడీపీ నేతలు ప్రశంసిస్తున్నారు.
టీడీపీ తరపున ఎంపీటీసీగా నామినేషన్ దాఖలు చేసేందుకు అంజిరెడ్డి మండల కార్యాలయానికి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు అంజిరెడ్డిని చుట్టుముట్టి నామినేషన్ పత్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. అయినా ఏ మాత్రం భయపడని అంజిరెడ్డి.. తొడ కొట్టి సవాల్ విసిరారు. చేతనైతే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కానీ, ఇలా రౌడీయిజం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ హెచ్చరికతో రెచ్చిపోయిన అధికార పార్టీ కార్యకర్త.. పక్కనే రాడ్ తీసుకొని దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన మీద దాడి చేయడానికి వచ్చినా అంజిరెడ్డి ఏ మాత్రం భయపడకుండా అలాగే ధైర్యంగా నిలబడ్డారు. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాత చూపిన తెగువకి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.