English | Telugu
రాజన్న రాజ్యమా? రావణ రాజ్యమా?
Updated : Mar 12, 2020
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు పదేపదే చెప్పిన మాట.. 'రాజన్న రాజ్యం తీసుకొస్తాం'. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల వంటి వారు ఎన్నికల ప్రచార సమయంలో 'రాజన్న రాజ్యం వస్తుంది'.. 'రాజశేఖర్ రెడ్డి పాలన మళ్లీ చూడబోతున్నారు' అని గొంతెత్తి మరీ చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.
ఇంత వరకు బాగానే ఉంది కానీ.. అసలు రాజన్న రాజ్యమంటే ఏంటి?.. రాజన్న రాజ్యం వస్తే ఎలా ఉంటుంది? అని ఆశగా ఎదురు చూసిన కొందరు మాత్రం.. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి.. ఇదేనా రాజన్న రాజ్యం అంటూ వణికిపోతున్నారు. అవును.. నిజమే కొందరు వైసీపీ శ్రేణుల ఆవేశం, అత్యుత్సాహం వల్ల సామాన్యులు భయపడిపోతున్నారు.
ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ స్థానిక పోరే.. స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎవరు, ఎప్పుడు, ఎవరి మీద దాడి చేస్తారో, ఆ దాడిలో మనం ఎక్కడ బలి అవుతామోనని.. స్థానికులు భయపడుతున్నారు. దానికి కారణం చాలా ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు ఇతర పార్టీల వారి మీద దాడులు చేయడమే.
అర్హత ఉన్నవారు ఎన్నికలలో పోటీ చేయడం రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆ రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన కొందరు చాలా చోట్ల ఇతర పార్టీ వాళ్ళని నామినేషన్స్ వేయనివ్వలేదు. నెల్లూరు జిల్లాలో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా కత్తితో దాడి చేశారు. పలు చోట్ల టీడీపీ అభ్యర్థుల మీద దాడులు చేశారు. ఇంకొన్ని చోట్ల నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారు. పోలీసులు, అధికారుల కళ్లెదుటే ఇవన్నీ జరగటం గమనార్హం.
ఇక గుంటూరు జిల్లాలో అయితే.. ఏకంగా ఓ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పై దాడి చేయడం కలకలం రేపింది. నామినేషన్ వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన.. టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో ఓ లాయర్ కి తీవ్ర గాయాలయ్యాయి. బోండా ఉమా, బుద్ధా వెంకన్న తృటిలో తప్పించుకున్నారు. లేదంటే ఘోర ప్రమాదం జరిగుండేదేమో!.
రెండు-మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలను.. మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా చూస్తున్న సామాన్యులు.. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం? ఇదేనా మేం కలలు కన్న రాజ్యం? అంటూ గుండెలు బాదుకుంటున్నారు.