English | Telugu

కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఎన్జీటీ కీలక ఆదేశాలు

గ్రేటరు హైదరాబాద్ శివారులో 111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్ ఫామ్ హౌస్ కడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీని పై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కేటీఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి, హెచ్ఎండీఏకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు నోటీసులు జారీ చేసింది.

కొన్ని నెలల క్రితం కేటీఆర్ త‌న ప‌ద‌విని అడ్డం పెట్టుకొని అక్ర‌మంగా ఫాంహౌజ్ నిర్మాణం చేస్తున్నారంటూ… డ్రోన్ విజువ‌ల్స్ తో స‌హా రేవంత్ రెడ్డి మీడియాకు స‌మాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై అప్పట్లో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో రేవంత్ జైలులో ఉండి తరువాత బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే.

తాజాగా ఎన్జీటీ తన ఆదేశాలలో కేటీఆర్ తన ఫామ్ హౌస్ ను అక్ర‌మంగా నిర్మించుకుంటున్నారా.. అసలు 2018లో 111జీవో పై ఎన్జీటీ ఇచ్చిన తీర్పు స‌రిగా అమ‌ల‌వుతుందో లేదో చూడటానికి ఒక నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీలో సభ్యులుగా జాతీయ ప‌ర్యావ‌ర‌ణ రిజిస్ట్రీ రిజ‌న‌ల్ ఆఫీసు నుండి ఒక‌రు, తెలంగాణ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు, హైదరాబాద్ వాట‌ర్ వ‌ర్క్స్, హెచ్ఎండీఏ నుండి ఒక్కొక్కరు తో పాటు రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ను క‌మిటీలో నియ‌మించింది. రెండు నెల‌ల్లోగా ఈ క‌మిటీ ఈ విషయం పై రిపోర్టు ఇవ్వాల‌ని ఆదేశించింది.