English | Telugu

ఫస్ట్ టార్గెట్ పత్తిపాటి పుల్లారావు.. సంచలనం రేపుతున్న సిట్ సోదాలు!

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై వైఎస్ జగన్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిట్ మొదట మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై గురిపెట్టింది. ఆయన బినామీలేమోనన్న అనుమానంతో.. ఆయన వియ్యంకుడితో పాటు, విజయవాడకు చెందిన ఓ బిల్డర్, మరో చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో సోదాలు జరిపారు.

రాజధాని ప్రకటన సమయంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొన్నారని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో పత్తిపాటి పుల్లారావుని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ఆయన వియ్యంకుడి ఇంట్లో సోదాలు చేశారు. అదేవిధంగా, విజయవాడలోని పటమటలంకలో ఉండే ఓ బిల్డర్ నివాసంతో పాటు, అతని కార్యాలయంలో సోదాలు చేశారు. ఓ చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోనూ సోదాలు చేశారు. అయితే, దీనిపై సిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే టీడీపీకి చెందిన మరికొంతమంది నేతల ఇళ్లలో కూడా సోదాలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.