English | Telugu
హైదరాబాద్ లో చిరంజీవి ఇంటి వద్ద టెన్షన్.. ఆ పుకార్లే కారణం!
Updated : Feb 29, 2020
హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద ఇవాళ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీలో మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామంటూ అమరావతి యువజన జేఏసీ పేరుతో కొన్ని ఊహాగానాలు చెలరేగాయి. చిరంజీవి తీరుకు నిరసనగా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ధర్నాకు దిగుతామని వాట్సాప్, ఫేస్ బుక్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి ఇంటి ముట్టడికి తామెలాంటి పిలుపు ఇవ్వలేదని జేఏసీ నేతలు స్పష్టత ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ధర్నా పిలుపు హైదరాబాద్ లోని పలు సోషల్ మీడియా గ్రూప్ ల్లో వైరల్ కావడంతో ఇవాళ ఉదయం నుంచే జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటికి అభిమాన సంఘాల నేతలు తరలివచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని మెగా కుటుంబ అభిమాన సంఘాల నేతలు భారీగా తరలిరావడంతో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. అమరావతి జేఏసీ నుంచి ఎవరైనా వచ్చి నిరసనలకు దిగితే ప్రతిఘటించేందుకు అభిమాన సంఘాల నేతలు తరలివచ్చినట్లు తెలిసింది. అయితే ముందుగా తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోమని, అమరావతి జేఏసీ పిలుపు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకే తాము ఇక్కడికి వచ్చినట్లు చిరంజీవి అభిమాన సంఘాల నేతలు తెలిపారు. భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో పోలీసులు చిరంజీవి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిరంజీవి నివాసానికి వెళ్లే దారులను బ్లాక్ చేస్తున్నారు.