English | Telugu

విశాఖ ఘటన వెనుక వైసీపీ.. కలకలం రేపుతున్న వాట్సాప్ చాట్!!

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా.. గురువారం విశాఖ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొందరు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకొని.. గో బ్యాక్ బాబు అని నినాదాలు చేస్తూ.. కాన్వాయ్ పైకి కోడిగుడ్లు, టొమాటోలు, చెప్పులు విసిరారు. అయితే ఈ ఘటన వెనుక అధికార పార్టీ వైసీపీ ఉందని టీడీపీ ఆరోపించింది. కానీ వైసీపీ నేతలు మాత్రం.. చంద్రబాబు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నందువల్లనే ప్రజలు తిరగబడ్డారని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే విశాఖ ఘటన వెనుక వైసీపీ ఉందనే ఆధారాలను టీడీపీ తాజాగా బయటపెట్టింది. విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైసీపీ నేతల ఆదేశాలతోనే ఆ పార్టీ కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను, గ్రామ వాలంటీర్లను ఎయిర్ పోర్టుకు తరలించారని చెప్పారు. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లో జరిగిన చాట్ స్క్రీన్ షాట్లను ఆయన మీడియాకు చూపించారు. డీఆర్డీఏ ఏపీఎంలు, ఎంపీడీవోలు వాట్సాప్ చేసిన మెసేజ్‌లను బయటపెట్టారు. ఎమ్మెల్యే అధ్యక్షతన ఎయిర్ పోర్టుకు వెళ్లేలా చేయాలని.. వారికి కావలసిన భోజనాలు, రవాణా సౌకర్యాలు అన్నీ స్థానిక నాయకులు చూసుకుంటారని.. ఆ మెసేజ్‌ లలో ఉందని తెలిపారు.