English | Telugu

హైకోర్టు తీర్పుతోనే అసలైన హొలీ: నారా లోకేష్ 

పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశం

చెడు పై మంచి గెలిచిన రోజున రంగులు చల్లుకొని హోలీ జరుపుకుంటాం. అదే హోలీ రోజున ప్రభుత్వ భవనాలకు వైకాపా వేసిన రంగులు చెరిపేయాలని కోర్టు తీర్పివ్వడం చెడు పై మంచి సాధించిన విజయం, అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. హొలీ పండుగ రోజున ఈ తీర్పు వెలువడటం పై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. పేద వాడికి అన్నం పెట్టడానికి మనసొప్పలేదు. 1400 కోట్ల ప్రజాధనం పోసి వేసిన రంగులు చెరిపేందుకు మరో 1400 కోట్లు? ఇదేనా రివర్స్ పాలన?, అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.