English | Telugu

మోషా క‌లిపారు వారిద్ద‌రినీ!

మోదీ, అమిత్‌షా జోక్యంతో అంబానీ జ‌గ‌న్‌ల మ‌ధ్య వున్న వైర్యం తొలిగింది. వారి మ‌ధ్య వున్న శ‌త్రుత్వాన్ని వ‌దులుకుని ఒక్క‌టైయ్యారు. బిజెపి-జ‌గ‌న్ కు ఉన్న అవ‌స‌రాలే వారి బంధాన్ని ప‌టిష్టం చేసిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

వైసీపీ-బీజేపీ మధ్య కొన‌సాగుతున్న రహస్య ప్రేమ న‌త్వానీని రాజ్య‌స‌భ‌కు పంప‌డానికి మార్గం సుగ‌మం చేసింది. త‌మ‌ ప్రేమ‌కు గుర్తుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బిజెపికి రాజ్య‌స‌భ సీటు గిఫ్ట్ గా ఇచ్చారు. పార్టీలో రాజ్య‌స‌భ సీటు కోసం తీవ్ర‌మైన పోటీ వున్న‌ప్ప‌ట్టికీ వారంద‌రినీ కాద‌ని నత్వానీ ఎంపిక చేసి తన ప్రేమ‌ను చాటుకున్నారు జ‌గ‌న్‌. రాజ్యసభ ఎన్నికలు బీజేపీ వైసీపీ బంధాన్ని నిజం చేశాయి. రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. ఈ నేపథ్యంలో వైసిపి అవ‌స‌రం బిజెపికి వుంది. జగన్ అయితే కేసుల కోసమైనా, తామ మాట వింటారన‌ది బిజెపి ధీమా. అటు, వైసీపీ అధినేత జగన్‌కూ తనకున్న కేసుల అవసరాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ సహకారం తప్పనిసరి.

బీజేపీ జగన్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేదన్నది సుస్పష్టం. జగన్ పార్టీకి లోక్‌సభ-రాజ్యసభలో బలం ఉంది. కాబట్టి ఆయనను వదులుకునేంత తెలివి తక్కువ పని బీజేపీ చేయదు. అంత అవసరం కూడా ఆ పార్టీకి లేదు. వైసీపీతో తెరచాటు స్నేహం చేస్తే, ప్రజలు ఏమనుకుంటారోనన్న భయం కూడా లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఎలాగూ బలం లేదు. కాబట్టి, కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు. రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలి. కమలానికి ఫ్యాను గాలి అవసరం వుంది. అదే బిజెపి లెక్కా.

అంబానీల‌కు ప్ర‌భుత్వంలో పనులు చేసి పెట్టే పెద్ద మ‌నిషే నత్వానీ. అయితే బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. నత్వానీని పార్టీ పరంగా, రాజ్యసభకు పంపించే అవకాశాలు లేవు. కాబట్టి, బీజేపీ ఢిల్లీ పెద్దలు జగన్‌తో సంబంధం కలిపారు. నత్వానీకి రాజ్యసభ సీటివ్వడం అనేది ప్రధాన అజెండాగా ప్రధానితో జగన్ భేటీ తర్వాత, అమిత్‌షాతో స‌మావేశం జ‌రిగింది. నత్వానీకి ఏపీ నుంచి రాజ్యసభకు రంగం సిద్ధం చేసి, జగన్‌తో మాట్లాడుకోండని చెప్పిన తర్వాతనే, ముఖేష్ అంబానీ ఆయనను వెంటబెట్టుకుని జగన్‌ను కలిశారు.

రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్ని చూసి ఏపీ బీజేపి నేత‌లు విష‌యాన్ని అర్థం చేసుకోలేక గిల‌గిల కొట్టుకుంటున్నారు. ఇంత‌కు త‌మ‌కు వైసీపీ మిత్రపక్షమో, శత్రుపక్షమో తేల్చుకోలేకపోతున్నారు.
అధికార పార్టీకి వ్య‌తిరేకంగా రాష్ట్ర సమస్యల పై తాము రోజూ యుద్ధం చేస్తుంటే ఢిల్లీ పెద్దలు మాత్రం ముఖ్య‌మంత్రితో తెరచాటు వ్య‌వ‌హారం చేయ‌డాన్ని మింగ‌లేక క‌క్క‌లేక నోరెళ్లబెడుతున్నారు. బీజేపీ నాయకురాలైన సంచయితకు సింహాచలం ఆలయ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే, ఢిల్లీ స్థాయిలో వైసీపి-బీజేపీ మధ్య ఉన్న పవిత్రబంధమేమిటో అర్ధమయి పోయింది.

నత్వానీ ని రాజ్య‌స‌భ‌కు పంపి త‌మ నేత జ‌గ‌న్‌ను కాపాడుకోవ‌డానికి మ‌రోసారి పార్టీ నేత‌లు త్యాగం చేయాల్సి వ‌చ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో సీటు కోసం, ఒంగోలులో తన స్థానాన్ని త్యాగం చేసిన వై.వి.సుబ్బారెడ్డి. వైసీపీలో చేరితే ఎం.పీ సీటు ఇస్తారని ఆశపడి చేరిన బీద మస్తాన్‌రావు. విపక్షంలో ఉండగా పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి. కాపు కోటాలో సీటు వస్తుందని ఆశించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. వీరందరికంటే, అన్న జైలులో ఉంటే పాదయాత్ర చేసి పార్టీని బతికించిన చెల్లెమ్మ షర్మిలల‌ ఆశ‌ల్ని అడిఆశ‌లు చేసి పరిమళ్ నత్వానీ అనే గుజరాతీయుడికి ముఖ్య‌మంత్రి జగన్ ఎం.పీ సీటివ్వడం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జగన్ జైలులో ఉండగా, వైవి సుబ్బారెడ్డి ఆయనను, ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడారు. ఆయనకూ ఈసారి నిరాశే ఎదురయింది. అన్న అరెస్టయి జైలులో ఉంటే, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చెల్లెలు షర్మిల చేసిన పాదయాత్ర, పార్టీని బతికించింది. అయినా, ఆమె త్యాగానికి ఇప్పటివరకూ ప్రతిఫలం లేదు.

మ‌రో వైపు తన భర్త మృతికి రిలయన్స్ కారణమని ఆరోపించిన వైఎస్ విజయలక్ష్మి ఆరోపణలు, తన తండ్రి మృతిపై సీబీఐ విచారించాలన్న జగన్ డిమాండు, తమ ప్రియతమ నేత వైఎస్ మృతికి అంబానీలే కారణమన్న ఆగ్రహంతో, వారి సంస్థలను తగులబెట్టిన వైఎస్ వీరాభిమానుల వీరంగాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఇంకా మర్చిపోలేదు. ముఖేష్ అంబానీ సీఎం జగన్ నివాసానికి రావడం రాజ్యసభ సీటు కోరడం నత్వానీకి రాజ్యసభ సీటివ్వడం చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. అంతే. తన తండ్రి మృతికి కారణమయ్యారని ఆరోపించిన, అదే అంబానీ కుటుంబ విధేయుడైన నత్వానీకి సీటివ్వడం వైసీపి కార్య‌క‌ర్త‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు.

ముఖేష్ అంబానీ-జగన్ మధ్య కేజీ బేసిన్ గ్యాస్ యుద్ధం జరిగిందని తెలుసు. వైఎస్ హెలికాప్టర్ మృతి వెనుక, కాంగ్రెస్-అంబానీ కుటుంబ హస్తం ఉందని స్వయంగా జగన్ మీడియా సాక్షి ఆనాడు కోడై కూసింది. స్వయంగా జగన్ మాతృమూర్తి విజయమ్మ కూడా అదే ఆరోపించారు. అటు జగనన్న కూడా అంబానీ కుటుంబంపై అనుమానం వ్యక్తం చేశారు.

వాస్త‌వానికి జగన్ మనస్తత్వం ప్రకారం చూస్తే అంబానీకి మాట్లాడే అవకాశమే ఇవ్వడ‌నిపిస్తుంది. వీలైతే రిల‌య‌న్స్ కంపెనీల‌కు ఏపీలో నిలవ నీడ లేకుండా చేస్తాడేమో అనుకునేవారు వైసిపి కార్య‌క‌ర్త‌లు. కానీ, అలాంటి అంబానీ సిఫార్సు చేసిన వ్యక్తికి, ఏకంగా రాజ్యసభ సీటే ఇచ్చారంటే.. జ‌గ‌న్ అవసరం ఏమిటన్నది ఇట్టే అర్ధమవుతుంది. దీన్నిబట్టి, జ‌గ‌న్ చెప్పే మాటలకు, చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదని, జగన్ కూడా ముదిరిన‌ రాజకీయ నాయకుడే అని తేలిపోయింది.

మత మార్పిళ్లు, అన్యమత ప్రచారం, స్వాముల యాగీ అంతా ప్రచారానికే తప్ప, దానితో బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. పాపం ఈ లోగుట్టు, తెరవెనుక బాగోతం తెలియక బీజేపీ సంప్రదాయవాదులు చొక్కాలు చించుకుంటున్నట్లు కనిపిస్తోంది.