English | Telugu

మీకు సిగ్గుగా లేదా వైఎస్ జగన్ గారు.. ఇప్పటికైనా మేల్కోండి

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శ్రీనవ్య (28) అనే వివాహిత గతనెల 11న డెంగ్యూ కారణంగా మృతిచెందింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన ఆమె భర్త చందనకుమార్‌ (35) కుమార్తె యోషిత(4)తో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ మరణాలు ఎక్కువయ్యాయి. నివారణకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వ్యక్తమవనున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా వైఎస్ జగన్ గారు? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా అని ఏడ్చారు. ఇప్పుడు మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు. రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోతున్నా మీలో చలనం లేదు. మండపేటలో శ్రీ నవ్య డెంగ్యూ తో చనిపోయారు. ఆ బాధతో ఆమె భర్త చందు,కూతురు యోషిత ఆత్మహత్యకి పాల్పడిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి." అని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.