లాక్ డౌన్ తో పేద ప్రజలు అల్లాడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వాపోయారు. లాక్ డౌన్ పొడిగింపు వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయని, పనులు లేవు,తినడానికి తిండి లేదు,ఎక్కడకి కదలలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు పుట్టే అవకాశం కూడా లేదు.సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న పేద కుటుంబాలను జగన్ గారు ఆదుకోవాలని, తక్షణమే 5 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని లోకేష్ కోరారు. రైతుల కష్టాలు వర్ణనాతీతం. మద్దతు ధర లేదు,రవాణా సౌకర్యం లేదని, లాక్ డౌన్ దెబ్బకి పండిన పంట పొలాల్లోనే వదిలేస్తున్నారని, అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని నారా లోకేష్ వివరించారు. లాక్ డౌన్,అకాల వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అంచనా వెయ్యాలని, రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపాలని కోరారు.