English | Telugu

సినీ రంగానికే చిరంజీవి జీవితం అంకితం.. రాజ్యసభ సభ్యత్వంపై నాగబాబు క్లారిటీ...

మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం దక్కనుందనే ప్రచారంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మెగా అభిమానుల్లో గందరగోళం సృష్టించేందుకే కొంతమంది ఇలా చేస్తున్నారని నాగబాబు మండిపడ్డారు. ప్రస్తుతం చిరంజీవికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. పవన్ కల్యాణ్ జనసేనతో కూడా చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, పవన్ ఆలోచనలను అన్నయ్యగా చిరంజీవి సమర్ధిస్తారని చెప్పుకొచ్చారు.

చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం అంటూ తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టిస్తున్నారని నాగబాబు ఫైరయ్యారు. చిరంజీవి ఏ పార్టీలోకి వెళ్లినా గొప్పగా స్వాగతం లభిస్తుందని, అలాంటప్పుడు రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిందన్నారు. అయితే, చిరంజీవి తన జీవితాన్ని తిరిగి సినీ రంగానికే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే రాజకీయాలను వదిలేసి, సినిమాలపై దృష్టిపెట్టారని నాగబాబు తెలిపారు. అందుకే, వరుస సినిమాల్లో నటిసక్తున్నారని చెప్పుకొచ్చారు. మెగా హీరోల్లో అందరి కంటే చిరంజీవే సినిమాల్లో బిజీగా ఉన్నారని గుర్తుచేశారు.

అన్నదమ్ములిద్దరూ ఒకే రంగంలో ఎందుకనే ఉద్దేశంతోనే చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారని నాగబాబు తెలిపారు. అంతేకాదు, తమ్ముడు పవన్ కోసం తన రాజకీయ జీవితాన్ని చిరంజీవి త్యాగం చేశారంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తనకంటే పవన్ అద్భుతంగా ప్రజలకు సేవ చేయగలడని, ఆయనకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్ ఉండాలంటే తాను అందులో ఉండకూడదని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారని నాగబాబు వివరించారు. చిరంజీవికి అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉంటాయని, అంతమాత్రాన ఆయా పార్టీల నిర్ణయాలకు ఆయన మద్దతు ఉన్నట్లు కాదన్నారు. ఇకకైనా, చిరంజీవిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని నాగబాబు సూచించారు.