English | Telugu
కరీంనగర్ కారు మిస్టరీలో కొత్త కోణం... సత్యనారాయణరెడ్డి డైరీలో కీలక ఆధారాలు...
Updated : Mar 5, 2020
కరీంనగర్ కాకతీయ కెనాల్‌లో దొరికిన కారుపై మిస్టరీ కొనసాగుతోంది. అది ప్రమాదమా? లేక యాక్సిడెంట్‌లా అల్లిన కథా? అనేది ఇంకా తేలలేదు. అయితే, పోలీసులకు మాత్రం ఒక క్లూ దొరికింది. అది ప్రమాదం కాదని మొదట్నుంచీ అనుమానిస్తోన్న పోలీసులకు ఆధారం లభించింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన ముగ్గురూ.... పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబం కావడంతో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.... మృతుడు సత్యనారాయణరెడ్డి ఫెర్టిలైజర్ షాపులో దొరికిన డైరీలో సంగతులు అనుమానాలకు బలం చేకూర్చాయి. సత్యనారాయణరెడ్డి తన డైరీలో 2020 జనవరి 27కి ముందు... తన ఆస్తి అంతా టీటీడీకి అప్పగించాలంటూ రాసుకున్నారు. దాంతో, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాకే, తన ఆస్తి గురించి డైరీలో రాశారని పోలీసులు భావిస్తున్నారు. డైరీలో దొరికిన ఈ ఆధారాన్ని బట్టి, సత్యనారాయణరెడ్డి కుటుంబానిది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
డైరీలో దొరికిన ఆధారాల ప్రకారం ఆత్మహత్యగా అనుమానిస్తున్నా, కొన్ని సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. జనవరి 27నే సత్యనారాయణరెడ్డి ఫోన్ స్విచ్ఛాప్ అయితే, అప్పట్నుంచి కారు దొరికే వరకు ఆ కుటుంబం ఏమైందో... ఎక్కడికి వెళ్లిందో... కనీసం ఆరా తీసిన వాళ్లే లేకపోవడంతో... ఆ ముగ్గురి మృతిపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇక, డ్రైవింగ్ సీట్లో ఉండాల్సిన సత్యనారాయణరెడ్డి మృతదేహం... కారు వెనుక సీట్లో ఉండటంపైనా సందేహాలు కలిగించాయి. పైగా అర్ధరాత్రిపూట కాలువలో ఒక బైక్ పడిపోతేనే స్థానికులకు శబ్ధం వినిపించినప్పుడు... మరి, అంతపెద్ద కారు... ప్రమాదానికి గురై... కాలువలో పడిపోతే.... ఎవ్వరికీ చప్పుడు వినిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అసలు ఏ రోజు, ఏ సమయంలో కారు... కెనాల్‌లో పడిందనేది సైతం మిస్టరీగా మారింది.
మరోవైపు, కాలువలో కారు బయటపడే నాటికి 15రోజుల కిందట సత్యనారాయణరెడ్డి, రాధ, వినయశ్రీ సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ చెప్పాలంటూ కరీంనగర్ త్రీటౌన్ పోలీసులను, అలాగే పెద్దపల్లి పోలీసులను సంప్రదించిన వ్యక్తులు ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం కూడా కలకలం రేపింది. ఈ ఎంక్వైరీ చేసిందెవరనేది సస్పెన్స్‌గా మారింది. ఈ అనుమానాలన్నింటికీ సమాధానాలు దొరికితేనే, ఈ ముగ్గురి మృతిపై అనుమానాలు తొలగిపోతాయి.