English | Telugu

సురేష్ మృతితో గౌరెల్లిలో టెన్షన్ టెన్షన్... రాత్రికి రాత్రే అంత్యక్రియలకు పోలీసుల ఒత్తిడి...

తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతితో అతని స్వగ్రామం గౌరెల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 65శాతం కాలిన గాయాలతో నాలుగు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మరణించడంతో ఆగమేఘాల మీద పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు... అప్పటికప్పుడు అంబులెన్స్ లో గౌరెల్లి తరలించారు. అయితే, డెడ్ బాడీ ఇంటికి చేరడంతో గ్రామస్తులు, కుటుంట సభ్యులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇక, సురేష్ అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గౌరెల్లి గ్రామంలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు.

అయితే, సురేష్‌... అంత క్రూరుడు కాదని, అతడ్ని ఎవరో రెచ్చగొట్టి... విజయారెడ్డిని హత్య చేయించారని కుటుంబ సభ్యులు అంటున్నారు. సురేష్‌ను రెచ్చగొట్టింది ఎవరో తేల్చాలని ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, సురేష్ కాల్ డేటా ఆధారంగా, ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సురేష్ కాల్ డేటాలో పలువురు రియల్టర్లు ఉండటంతో వాళ్లందరినీ పిలిచి విచారిస్తున్నారు. ఇదిలాఉంటే, విజయారెడ్డి మర్డర్ కి రెండ్రోజుల ముందు ఆమె ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహిస్తూ... విజయారెడ్డి భర్తతో సురేష్ మాట్లాడినట్లు కూడా ఆధారాలు సేకరించారు.

ఇక, సురేష్ మృతికి ముందు పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. పట్టా ఇవ్వలేదన్న కోపంతోనే తహశీల్దార్‌ విజయారెడ్డిని సజీవదహనం చేసినట్లు సురేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... పట్టా ఇవ్వకపోవడంతోనే చంపేసినట్లు చెప్పాడు. నవంబర్‌ నాలుగున మధ్యాహ్నం చివరిసారిగా విజ్ఞప్తి చేశానని... అయినా విజయారెడ్డి పట్టించుకోకపోవడంతో.... తిరిగి పెట్రోల్‌ డబ్బాతో వెళ్లి... తగలబెట్టానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.