English | Telugu

టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారు? రమణదీక్షితులు రీఎంట్రీపై చంద్రబాబు ఫైర్

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులకు మళ్లీ టీటీడీలో ప్రవేశం కల్పించడంపై చంద్రబాబు మండిపడ్డారు. అసత్య ఆరోపణలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిన దీక్షితులును తిరిగి ఎలా విధుల్లోకి తీసుకుంటారని ప్రశ్నించారు. పింక్ డైమండ్ మాయమైందంటూ నానా యాగీ చేసిన రమణదీక్షితులపై పరువు నష్టం దావాను ఎలా ఉపసంహరించుకుంటారని నిలదీశారు. ఎన్నో ఆరోపణలున్న రమణదీక్షితులను టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుడిగా నియమించడం మంచిది కాదన్నారు చంద్రబాబు. అసలు జగన్ వైఖరిని చూస్తుంటే... త్వరలో దీక్షితులను టీటీడీ ప్రధాన అర్చుకుడిగా నియమించేలా ఉన్నారని నిప్పులు చెరిగారు.

జగన్మోహన్ రెడ్డికి అసలు తన సొంత మతం గురించి చెప్పుకునే ధైర్యం లేదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. వెంకన్నతో జగన్ ఆటలు ఆడుతున్నారన్న బాబు.... అది ఎంత కాలమో సాగదన్నారు. దేవుడితో ఆటలాడుకునేవారు అసలు బాగుపడరంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే హిందువులు ఏడాది వరకు ఆలయాలకు వెళ్లరని, కానీ జగన్ మాత్రం హిందూ విశ్వాసాలను తుంగలో తొక్కి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని మండిపడ్డారు. సోనియాగాంధీ, అబ్దుల్ కలాం లాంటి అన్యమతస్థులు... వెంకటేశ్వరస్వామిపై విశ్వాసముందని అఫిడవిట్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారని, కానీ జగన్ కు మాత్రం ఆ ధైర్యం లేదన్నారు. అసలు తాను క్రిస్టియన్ అని చెప్పుకునేందుకే జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిన విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు.... తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.