English | Telugu

మంగళగిరి ఎమ్మెల్యే మిస్సింగ్..! కనిపించడం లేదంటూ ఫిర్యాదు

ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే... మంగళగిరి ఎమ్మెల్యే... వైసీపీ నుంచి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే... అంతేకాదు, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఓడించిన సాధారణ నాయకుడు... ఇక, ఆర్కే వ్యవహారశైలి కూడా చాలా డిఫరెంట్ గానే ఉంటుంది.... తాను చాలా సాదాసీదా మనిషినని... రైతు బిడ్డనని... పేద మధ్యతరగతి ప్రజల్లో ఒకడినని ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కూలీలతో కలిసి పనిచేయడం... వాళ్లతో కలిసి భోజనం చేయడం... ఓ సాధారణ రైతులా అన్నీ పనులూ చేస్తూ మీడియా దృష్టిని తన వైపు తిప్పుకుంటూ ఉంటారు. అది నిజమో లేక బిల్డప్పో తెలియదు గానీ. ఈ వ్యవహార శైలే నారా లోకేష్ పై గెలవడానికి ఉపయోగపడింది. తానొక సామాన్యుడునని... అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పుకునే మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే, వారం రోజులుగా తన నియోజకవర్గ రైతులు, ప్రజలు ఆందోళన చేస్తుంటే అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ వారం రోజులుగా రైతులు, కూలీలు, ప్రజలు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతుంటే ఎమ్మెల్యే ఆర్కే మాత్రం ఒక్కసారి కూడా మీడిమా ముందుకి రాలేదు. దాంతో, తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. తామంతా అమరావతి కోసం ఆందోళనలు చేస్తుంటే... తమ ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వారం పది రోజులుగా తమ ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదని... అతడిని వెదికి పెట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు, కూలీలు.

అమరావతిపై తమలో ఆందోళన నెలకొందని, తమ గోడును చెప్పుకుందామంటే తమ ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియడం లేదని రాజధాని రైతులు, ప్రజలు, కూలీలు అంటున్నారు. తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నామని, మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి తమకు అప్పగించాలంటూ పోలీసులను కోరారు. వారం రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోనూ గానీ... ఆయన కార్యాలయంలో గానీ... ఇంట్లో గానీ ఎక్కడా కనిపించ లేదని నిడమర్రు రైతులు అంటున్నారు. తమ ఎమ్మెల్యే కనిపించకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియకే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. దయచేసి తమ ఎమ్మెల్యే ఆర్కేని వెదికి తమకు అప్పగించాలంటూ కంప్లైంట్ లో రాశారు రైతులు.