English | Telugu

ప్రత్యేక జిల్లాల పేరుతో ఆందోళనలు చేపడుతున్న ఏపీ ప్రజలు!!

ఏపీకి 3 రాజధానులు అని జగన్ చేసిన ప్రకటన మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఎవరికి వారు తమ ప్రాంతంమే రాజధాని అవ్వాలని ఆందోళనలుచేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రత్యేక జిల్లాల అంశం తెర మీదకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రాజధానుల పై రచ్చ జరుగుతోంది. ఓ వైపు సంబరాలు, మరోవైపు ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్తగా 12 జిల్లాల వస్తాయంటూ చేసిన ప్రకటన మరో చర్చకు దారితీసింది. విషయం పాతదే అయినా ఆశలు ఆకాంక్షలు పెరిగిపోయాయి. మాకు జిల్లా కావాలంటూ క్రమంగా స్వరం పెరుగుతోంది. పాత డిమాండ్లే కాదు కొత్త గళాలు వినిపిస్తున్నాయి. చారిత్రిక నేపథ్యాలు, జనాభా ఇలా తమకుండే ప్రాధాన్యతల ముందుంచి తమకు జిల్లా కావాలి అంటున్నారు. ఎన్నికలకు ముందు పాద యాత్రలో జగన్ కొత్త జిల్లాలపై స్పష్టమైన హామీ ఇచ్చారు, ప్రతి పార్లమెంట్ నియోజక వర్గాన్ని జిల్లాగా మారుస్తామన్నారు. ఆచరణలోకి వస్తే 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా అవతరించనుంది. నిన్న మొన్నటి వరకు 25 జిల్లాలకే జనాలు దాదాపుగా సిద్ధపడ్డారు. కానీ రాజధానుల అంశం తెరమీదకు వచ్చిన తరువాత ప్రజల్లో ఆశలు రేగాయి. రాజధాని రావడం లేదు, పోరాడితే జిల్లా అయిన వస్తుందన్న భావన పెరిగింది. అందుకే కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెరమీదకొస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో హిందూపురం ప్రత్యేక జిల్లా చెయ్యాలన్నది దశాబ్దాల కాలాల డిమాండ్, దేశ విదేశాల్లో పుట్టపర్తికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యం లోనే దీనినే జిల్లా కేంద్రంగా చెయ్యాలన్నది స్థానికులు అభిమతం, పేరు మాత్రమే కాదు జిల్లా కేంద్రం కూడా ఇదే కావాలి అంటూ కొందరి వాదన. ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతి నిధులపై ఒత్తిడి పెరిగిపోతోంది. కర్నూలు జిల్లాలో నంద్యాల ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. కడప జిల్లా రాజంపేట విషయం లోనూ ఎలాంటి అనుమానాలు లేవు కాగా చిత్తూరు జిల్లాలో తిరుపతి కొత్తగా జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. అయితే దీనికి బాలాజీ పేరుపెట్టాలన్నది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. కొత్తగా మదనపల్లి వంటి ప్రాంతాల్లో కూడా జిల్లా డిమాండ్ వినిపిస్తోంది. మొత్తానికి రాయలసీమలో అదనంగా మరో నాలుగు జిల్లాలు వచ్చి చేరే అవకాశముంది. చివరికి ఈ సంఖ్య 8 కి చేరుతుంది. సీఎం రాయలసీమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.