English | Telugu
151 సీట్ల అఖండ మెజారిటీ ఇచ్చి... మళ్ళీ ఈ రచ్చేంటి?
Updated : Dec 23, 2019
ఏపీలో రాజధాని మార్పు పై రచ్చ మాములుగా లేదు. సీఎం జగన్ అసెంబ్లీ లో మూడు చోట్ల రాజధాని పెట్టవచ్చు అన్నప్పటి నుండి మొదలై ప్రభుత్వం నియమించిన జి ఎస్ రావు కమిటీ రిపోర్ట్ బయటకు రావడంతో నిరసనలు మిన్నంటుతున్నాయి. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. ఐతే గత ప్రభుత్వాధినేత మాజీ సీఎం చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాలలో ఒకటి అమరావతి రాజధాని. ఐతే మొన్న ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో బాబు నాయకత్వం లోని టీడీపీ ని దారుణంగా ఓడించి వైస్సార్సీపీ కి 151 సీట్ల అఖండ మెజారిటీ కట్టబెట్టిన విషయం తెలిసిందే. కారణాలేమైనప్పటికీ రాజధాని పరిసర జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలలో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీన్ని బట్టి బహుశా ఆ జిల్లాల ప్రజలకు కూడా అమరావతి రాజధాని వద్దనుకున్నారో లేక ఆల్రెడీ రాజధాని వచ్చేసింది కదా ఇక బాబు గారితో పనేముందనుకున్నారో కానీ పాపం టీడీపీకి కృష్ణా జిల్లా నుండి రెండు, గుంటూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. సాక్షాత్తు రాజధాని ప్రాంత నియోజక వర్గాలైన తాడికొండ, మంగళగిరి నియోజకవరాగాల్లో కూడా టీడీపీ ని కాదని వైస్సార్సీపీకి అక్కడి ప్రజలు పట్టం కట్టిన విషయం తెలిసిందే. బాబుగారేమో ఇదిగో నేను అభివృద్ధి వికేంద్రీకరిస్తున్నాను అంటూ ఒక కియా మోటార్స్ ను వెనుక పడిన జిల్లా అనంతపూర్ లో, సోలార్ పవర్ ప్లాంట్ ను కర్నూల్ లో, హీరో మోటార్స్ ను చిత్తూర్ జిల్లాలో, సిమన్స్ గమేశా వంటి పరిశ్రమలను నెల్లూరు, శ్రీసిటీలలో నెలకొల్పినా కూడా టీడీపీకి కేవలం 23 సీట్లిచ్చి ఇక చాలు పొమ్మన్నారు ఎపి ప్రజలు.
తాజాగా అమరావతిలో గవర్నర్ నివాసం, అసెంబ్లీ (కేవలం శీతాకాల సమావేశాల కోసం) మాత్రమే అని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతికి భూములిచ్చిన రైతులు ఇపుడు మా పరిస్థితేంటని రోడ్డెక్కారు. ఐతే ఇపుడు కూడా అటు గుంటూరు జిల్లానుండి కానీ ఇటు కృష్ణా జిల్లా నుండి ఆ రైతులకు మద్దతు గా బయటకు వచ్చేవాళ్లే కరువైన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికి రాజధాని లేని రాష్ట్రానికి తమ జీవనాధారమైన ౩౩౦౦౦ ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు, నాయకులూ వస్తుంటారు కనుమరుగవుతుంటారు. కానీ రాజధాని ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా ఉంటె అదే పదివేలు అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అంతే కాకుండా ఒకసారి సెక్రటేరియట్, సీఎం నివాసం విశాఖపట్నానికి మార్చిన తరువాత మెల్లగా మూడు చోట్ల రాజధాని ఆర్ధిక భారం అవుతోందని చెప్పి ప్రస్తుతం అమరావతి లో ఉండే కొద్ది ప్రభుత్వ కార్యకలాపాలను కూడా నిలిపివేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందని ఎన్నికలకు ముందు టీడీపీ పదేపదే చెప్పింది. అయినా ప్రజలు వైసీపీకి 151 సీట్లిచ్చి అధికారం కట్టబెట్టారు. మరి అప్పుడు గెలిపించి ఇప్పుడు రాజధాని మార్పు అంటే రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పొతే రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్ధకం అవుతుందని.. రాజధానిపై స్పష్టమైన, శాశ్వతమైన నిర్ణయం తీసుకొని ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళన దూరం చేయాలని విశ్లేషకులు కోరుతున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ప్రభుత్వానికి ఢోకా లేదు.. అయినా ఇంకా దేనికి భయపడుతూ ఇలా రాజధాని పేరుతో రాజకీయాలు చేసి రచ్చ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.