English | Telugu

రికార్డ్ స్థాయి ధర... వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి రూ.20వేలు

ఎర్ర బంగారం పండించిన రైతుల ఇంట సిరులు కురుస్తున్నాయి. మార్కెట్ లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర పలుకుతుంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో మిర్చి రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి ధర రూ.20 వేలకు పైగా పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత ధర గతంలో ఎన్నడూ పలకలేదని మార్కెట్ చరిత్ర లోనే ఇది తొలిసారి అంటున్నారు అధికారులు.

ఈ సారి ఉల్లి, మిర్చి రైతులకు లాభసాటిగా మారిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో రైతులు మిర్చిని సాగు చేశారు. తేజ యూఎస్ 341 డీడీ రకానికి చెందిన మిర్చిని అధికంగా పండించారు. దీంతో ఈ ఏడాది మార్కెట్ లోకి భారీగా మిర్చి పంటను తీసుకొస్తున్నారు రైతులు. ఇక క్వింటాల్ కు రూ.20,600 రూపాయలు పలికింది. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా మిర్చి తోటలు దెబ్బ తిన్న కారణంగా పంట దిగుబడి తక్కువగా వచ్చింది. దీంతో మిర్చికి డిమాండ్ పెరిగింది. గత ఏడాది కన్నా ఈ సారి మిర్చి పంట దిగుబడి తగ్గినా గిట్టుబాటు ధర లభించడం తమకు కాస్త ఊరట కలిగిస్తోందని దీంతో ప్రస్తుత ధరల వల్ల తాము అప్పులోంచి బయటపడే అవకాశముందని మిర్చి రైతు అభిప్రాయపడుతున్నారు. ధరలు ఇలాగే ఉంటే రైతులకు లాభం చేకూరుతుందన్నారు అధికారులు. మరో వైపు ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నారు మార్కెట్ అధికారులు. అయితే గిట్టుబాటు ధర లభించేందుకు మిర్చి రైతులు పంటను మార్కెట్ కు తరలించేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకవేళ రైతుకు గిట్టుబాటు ధర రాని పక్షాణ కోల్డ్ స్టోరేజీలో భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.