English | Telugu

కూతురు, అల్లుడిపై ఏపీ మంత్రి గన్‌మెన్ దాడి

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ మంత్రి తానేటి వనిత గన్‌మెన్‌ చంద్రారావు రెచ్చిపోయాడు. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు, అల్లుడిపై దాడి చేశాడు. ఐదు నెలల క్రితం పోలీసుల సమక్షంలో చంద్రారావు కూతురు ప్రేమపెళ్లి చేసుకుంది. అప్పటినుండి కూతురిపై కోపం పెంచుకున్నాడు. కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని చంద్రారావు.. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అన్న కనికరం కూడా లేకుంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై కూతురు, అల్లుడిని తరుముతూ దాడి చేశాడు. కూతురు వేడుకుంటున్నా చంద్రారావు వదిలిపెట్టలేదు.

ఈ ఘటన పై ఎస్పీ నారాయణ నాయక్ స్పందించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. కాగా, ఇప్పటికే పోలీసులు చంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది.