English | Telugu
అక్రమాలకు పాల్పడితే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై!!
Updated : Feb 12, 2020
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశానంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి తెలిపారు.
పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత ఇకపై సర్పంచ్‌లదే ఉంటుందన్నారు. సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. సర్పంచ్ స్థానికంగా నివసించాలి, రోజు పంచాయితీ కార్యాలయానికి వెళ్లాలని అన్నారు. తాగునీటి అవసరాలు, ప్రకృతి వైపరిత్యాల నివారణకై సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు మంత్రి వెల్లడించారు.
ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే.. గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభ పెడితే అనర్హత వేటు నిబంధన మున్సిపల్ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై చేస్తామని మంత్రి హెచ్చరించారు.