English | Telugu
ఇంగ్లీష్ మీడియం నిర్ణయానికి 45 వేలకు పైగా పాఠశాలల మద్దతు!!
Updated : Feb 12, 2020
ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సరైన నిర్ణయమే.. కానీ, తెలుగు మీడియాన్ని పూర్తిగా తొలగించడం సరికాదని విమర్శించాయి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో అసలు తెలుగు భాషనే మర్చిపోయే ప్రమాదముందని హెచ్చరించాయి. అయినా ఈ విషయంలో జగన్ సర్కార్ వెనకడుగు వేయడం లేదు. ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, పేద విద్యార్థుల భవిష్యత్తు ఇంగ్లీష్ మీడియంతోనే మారుతుందని చెప్పుకొచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు అందరి ఆమోదం ఉందని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తాజాగా ఇదే చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలు తమ అంగీకారాన్ని తెలియ చేస్తూ తీర్మానం చేశాయి. 45 వేల పై చిలుకు పాఠశాలల నుంచి ఈ తీర్మానాలు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం గురించి అంతా సానుకూలంగా నే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతా ఏకీభవిస్తూ, స్వాగతిస్తున్నామని చెప్పి తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలను అన్ని సచివాలయంలో ప్రదర్శనకు పెట్టామని మంత్రి తెలిపారు.