English | Telugu
ఉన్నావ్ కేసులో న్యాయం జరిగినట్టేనా? ఎమ్మెల్యేకు ఉరిశిక్ష ఎందుకు పడలేదు?
Updated : Dec 21, 2019
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు... జీవితఖైదును విధించింది. ఇక, బాధితురాలి కుటుంబానికి 25లక్షల పరిహారంతోపాటు కుటుంబానికి రక్షణ కల్పించాంటూ సంచలన తీర్పునిచ్చింది.
రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడంటూ పదహారేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, 2017 జూన్ 4న కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. అనంతరం కేసు అనేక మలుపులు తిరిగింది. అయితే, తనకు న్యాయం జరగడం లేదంటూ యూపీ సీఎం యోగి నివాసం ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఈ కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. యూపీతోపాటు దేశవ్యాప్తంగా ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించడంతో సీబీఐకి అప్పగించారు. దాంతో, కుల్దీప్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ... అతనిపై కిడ్నాప్ అండ్ రేప్, అలాగే నేరపూరిత బెదిరింపుల కింద కేసులు నమోదుచేసి విచారణ చేపట్టింది.
అయితే, బాధితురాలి కుటుంబంపై పలుమార్లు హత్యాయత్నం జరిగింది. 2019 జులై 28న బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మృత్యువాత పడ్డారు. అయితే, తనను అంతం చేసేందుకే ట్రక్కుతో ఢీకొట్టారని బాధితురాలు ఆరోపించింది. అప్పటి సీజేఐ గొగోయ్‌కి బాధితురాలు లేఖ రాసింది. దాంతో, ఆగస్ట్ ఒకటిన కేసును లక్నో నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం జోక్యంతో రోజువారీ విచారణ చేపట్టిన కోర్టు.... కుల్దీప్‌ను దోషిగా నిర్ధారించి జీవితఖైదును విధించింది. కుల్దీప్‌కు జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే భోరున విలపించాడు. ఉన్నావ్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కుల్దీప్ సింగ్ సెంగార్.... ఇకచ తన జీవితం మొత్తాన్ని జైల్లోనే గడపనున్నాడు.