English | Telugu

జార్కండ్ లో కమలదళంకు నిరాశ ఎదురవ్వనుందా?

నిన్న మొన్నటి దాకా బీజేపీ పార్టీ ఒక ఊపు ఊపేసిన విషయం అందరికి తెలిసిందే.కానీమొన్నటి మహారాష్ట్రా ఎన్నికల తరువాత బీజేపీ కూడా ఒక అడుగు వెనక్కు వేస్తొంది.ఎన్నికల భయం బీజేపీకి కూడా చేరుకుంది.జార్కండ్ లో కమలదళానికి నిరాశ తప్పేలా లేదు, ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకున్న ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ సారి జార్ఖండ్ హస్తగతమవుతుంది అని చెప్పాయి. అక్కడ జేఎంఎం ఆర్జేడీలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని తెలిపాయి. మొత్తం 81 స్థానాలకు 5 దశల్లో ఎన్నికలు జరగ్గా ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా బరిలోకి దిగగా కాంగ్రెస్ పార్టీ, జేఎంఎం ఆర్జేడీలతో కలిసి కూటమిగా పోటీ చేసింది. జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31, ఆర్జెడీ 7 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక తాజాగా పలు సంస్థలు విడుదల చేసిన సర్వే ఫలితాలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే బీజేపీ 22 నుంచి 32 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ కూటమికి 38 నుంచి 50 స్థానాలు వస్తాయని, ఎజీఎస్యుకు 3 నుంచి 5 స్థానాలు, ఇతరులు 6 నుంచి 11 సీట్లు గెలుస్తారని జోస్యం చెప్పింది. ఐఐఎస్సీ ఓటర్ ఏబీపీ మాత్రం బీజేపీకి 32, కాంగ్రెస్ కూటమికి 35 ఏజేఎస్ యూకు 5 ఇతరులకు 9 సీట్లు వస్తాయని చెప్పింది. టైమ్స్ నౌ సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ 28, కాంగ్రెస్ కూటమి 44, జేబీఎం 3, ఇతరులు 6 సీట్లు గెలవనున్నారు. స్థానిక న్యూస్ ఛానల్ కసిష్ న్యూస్ నిర్వహించిన సర్వేలో బీజేపీ 25 నుంచి 30, కాంగ్రెస్ కూటమి 37 నుంచి 49, ఏజేఎస్యూ 2 నుంచి 4, ఇతరులు 2 నుంచి 4 సీట్లు సాధిస్తాయని తెలిపింది. జార్ఖండ్ లో అధికారం చేపట్టాలంటే మాజిక్ ఫిగర్ 42 సాధించాలి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అసలు ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ నెల 23 దాకా వేచి చూడాలి.