English | Telugu

అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు... దొడ్డిదారిలో జీఎన్ రావు కమిటీ...

రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. 29 రాజధాని గ్రామాల్లో ధర్నాలు, రాస్తారోకో, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు, రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరింత మండిపడుతున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటనతో సగం చచ్చిపోయామని... ఇప్పుడు పెద్దిరెడ్డి కామెంట్స్ మరింత తీవ్ర క్షోభకు గురిచేశాయని భగ్గుమంటున్నారు.

అయితే, అసెంబ్లీ వేదికగా ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ సీఎం జగన్ మాటలనే.... జీఎన్ రావు కమిటీ కూడా చెప్పడంతో రాజధాని రైతులు మరింత ఆగ్రహావేశాలకు గురయ్యారు. అమరావతిలో పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు, కటౌట్లు చింపేసి ఆందోళనలు నిర్వహించారు. జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీఎన్ రావు కమిటీ అసలు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని... ప్రభుత్వం చెప్పినట్లుగా నివేదిక రాసిచ్చారని మండిపడ్డారు. అయితే, సచివాలయం-మందడం వై జంక్షన్ దగ్గర రదాహరిపై జేసీబీని అడ్డంగా పెట్టి ధర్నా చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో, జీఎన్ రావు కమిటీ సభ్యులను సచివాలయం నుంచి మరో మార్గంలో తీసుకెళ్లారు పోలీసులు. అదే సమయంలో, రైతులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను దాటేందుకు విఫలయత్నం చేశారు. అయితే, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదిలాఉంటే, అమరావతి రైతుల నిరసనకు జనసేన సంఘీభావం ప్రకటించింది. మందడం గ్రామంలో రైతులతోపాటు ధర్నాలో పాల్గొన్న జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు... రాజధాని ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. అధికారం ఉందని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ, రైతులను బాధపెట్టొద్దంటూ హెచ్చరించారు‌. రాజధాని కోసం భూములను త్యాగం చేస్తే, రైతులను చులకనగా మాట్లాడటం సరికాదన్నారు నాదెండ్ల మనోహర్. రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుందన్న నాగబాబు... ప్రతి జిల్లా కేంద్రాన్నీ హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారు.