English | Telugu
కేరళలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు.. మార్చి ఆఖరు వరకూ అన్నీ బంద్!
Updated : Mar 10, 2020
కరోనా ధాటికి కేరళ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మార్చి ఆఖరు వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయ్ ప్రకటన చేశారు. ఏడో తరగతి పైబడిన విద్యార్థుల పరీక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. ఈ నెల మొత్తం ప్రభుత్వ పరమైన వేడుకలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సినిమా హాళ్లు డ్రామా కంపెనీలు తెరవద్దని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే నిశ్చయమైన పెళ్లిళ్లు మాత్రమే జరపాలని.. అవి కూడా తక్కువ మందితో నిర్వహిస్తే మంచిదని అన్నారు. మత సంబంధమైన వేడుకలు కూడా నిర్వహించొద్దని ఆదేశించారు. ఇప్పటివరకూ కేరళ వ్యాప్తంగా దాదాపు 1116 కరోనా అనుమానితుల వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
కరోనా ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపైనే కాదు.. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్‌లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో చాలా మాల్స్‌తో పాటు థియేటర్స్ ఇపుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొత్త సినిమాల విడుదలను కూడా ఆపేశారు.ఎక్కువమంది ఒక్క చోట ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
తాజాగా కేరళలో కరోనాకు సంబంధించిన మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తక్షణ చర్యల్లో భాగంగా అత్యధిక మంది గూమిగూడే ప్రదేశాలైన థియేటర్స్, మాల్స్, ఎగ్జిబిషన్‌కు సంబంధించిన వాటిని ఈ నెల 31 వరకు నిరవధికంగా బంద్ చేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.