English | Telugu
100 కి కాల్ చేసి సాయమడిగితే.. నిద్ర చెడగొడతావా అంటూ కొట్టిన పోలీస్
Updated : Dec 23, 2019
సాయం కోసం 100 కి కాల్ చేయండి.. నిమిషాల్లో మీ ముందుంటాం మీకు సాయం చేస్తామని పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రచారానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సాయం కోసం కాల్ చేసినవారినే.. కొడుతున్నారు చివాట్లు పెడుతున్నారు. అల్లరి మూకల నుంచి రక్షించమని ఓ యువకుడు ‘100’కు కాల్ చేస్తే... తిరిగి అతనికే క్లాస్ పీకిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జీడిమెట్లలో జరిగింది.
అల్లరిమూక గొడవ చేస్తుండటంతో ‘100’కి ఫోన్ చేశాడు ఓ యువకుడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు.. అక్కడికి చేరుకుని అల్లరిమూకను చెదరగొట్టారు. అయితే అక్కడున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు మాత్రం.. ‘100’కి ఫోన్ చేసిన యువకుడిపై తిట్ల దండకం అందుకున్నాడు. అర్ధరాత్రిపూట నిద్ర ఎందుకు చెడగొట్టావురా? ఎవరు కొట్టుకుని చస్తే నీకెందుకురా? అంటూ బూతులతో రెచ్చిపోయాడు. అక్కడితో ఆగక.. రెండు దెబ్బలు కొట్టి, తిడుతూ జీపులో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. చివరకు ఆ యువకుడు తాను మీడియాలో పని చేస్తున్నానని చెప్పడంతో.. కంగారుపడిపోయిన కానిస్టేబుల్.. సారీ అంటూ అతన్ని ఇంటి వద్ద దింపి వెళ్లాడు. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ సజ్జనార్.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అయితే పోలీసులపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందని ప్రజలు మండిపడుతున్నారు.