English | Telugu

పాలమూరు టీఆర్ఎస్ లో ప్రచ్ఛన్న యుద్ధం... రెండు గ్రూపులుగా  మంత్రులు, ఎమ్మెల్యేలు...!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య లేదని ప్రచారం సాగుతుండగా... ఇక, ఇప్పడు ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత లేదన్న మాటలు వినపడుతున్నాయి. గ్రూప్ రాజకీయాలతో దూషణలకు, భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అల్లంపూర్, గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరడంతో, పార్టీ అధినేత వరకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై అధినాయకత్వం అసహనం కూడా వ్యక్తంచేసింది. ఇక, జోగుళాంబ జిల్లాలోనూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజేస్తోంది ఇసుక పంచాయితీ. ఇసుక రవాణాపై ఆధిపత్యం కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వానేనా అంటున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కోసం టీఆర్‌ఎస్ నేతలు పోటీపడుతున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు కేసీఆర్ కు ఫిర్యాదులు చేసుకున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ భర్త తిరుపతయ్య... కేసీఆర్‌ను కలిసి గద్వాల ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తన నియోజవకర్గంలో గద్వాల ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారని అలంపూర్ ఎమ్మెల్యే ...ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, అలాగే జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యతోపాటు మరో ఇద్దరు ముఖ్య నేతలందరూ ఒక జట్టుగా ఏర్పడి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి నిరంజన్ రెడ్డి ద్వారా కేసీఆర్‌కు, కేటీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అయితే, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాగే, అధిష్టాన పెద్దలకు అత్యంత సన్నిహిత నాయకుల ద్వారా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాంపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద జోగులాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్‌ నేతల మధ్య కోల్డ్‌వార్‌ పీక్స్‌కు చేరిందని టీఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. ఈ ఎఫెక్ట్‌ మున్సిపల్ ఎన్నికలపై పడుతుందేమోనని, అధిష్టాన పెద్దలు టెన్షన్‌ పడుతున్నారు. అందుకే, వీలైనంత త్వరగా టీఆర్‌ఎస్ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే, అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహార శైలితో టీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న రగడను ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ జెండా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.