English | Telugu

విజయవాడ మరో ఉహాన్ కాకముందే మేల్కోండి!

సీఎం నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభిస్తోందని జ‌న‌సేన ఆరోపించింది. ముఖ్యమంత్రి నివాసానికి స‌మీపంలో ఉన్న కృష్ణలంక కరోనాకు కేరాఫ్ అడ్రస్‌‌‌గా మారింది. రెడ్‌జోన్‌లను కనీసం సందర్శించని మీరు సమర్థ వంత‌మైన ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నిస్తూ సీఎం జగన్‌కు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ బహిరంగ లేఖ రాశారు. గవర్నర్ బంగ్లాను కరోనా తాకినా.. విజయవాడ నగరంపై సీఎం జగన్ దృష్టిసారించరా? అని ప్రశ్నించారు.

ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతూ వైరస్ సాయిరెడ్డిగా మారిపోయారని ప్రజలు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ మరో ఉహాన్ కాకముందే మేల్కోవాలన్నారు. రాజకీయ చదరంగంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల బంగారు భవిష్యత్తు ఆగమైపోతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి వల్ల ఈ రెండు జిల్లాల ప్రజలు తమ ఆస్తులను కోల్పోవడంతో పాటు ప్రాణాలను సైతం పోగొట్టుకునేలా ఉందన్నారు. ఇప్ప‌ట్టికైనా ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవ చూపి ప్రజల ప్రాణాలను కాపాడాలని మహేష్ విజ్ఞప్తి చేశారు.