English | Telugu
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన కన్నా, పవన్ కళ్యాణ్
Updated : Mar 12, 2020
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గ్రామ స్వరాజ్యం కావాలంటే ఈ స్థానిక ఎన్నికలు ఎంతో కీలకమనే, తెదేపా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిందని ఆయన దుయ్యబట్టారు.
" ఇవాళ వైకాపా దౌర్జన్యం చేస్తోంది. ప్రజా స్వామ్యం పట్ల ఏమాత్రం వైకాపాకు గౌరవం లేదు. ఏ జిల్లాలోనూ విపక్షాల సభ్యులు నామినేషన్ వేసే పరిస్థితులు లేవు. 151 మంది సభ్యులు ఉంటే ఇంత భయం ఎందుకు," అని జనసేనాధిపతి ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకోకపోవడం దారుణం. మీరు ఏ చర్య తీసుకోకపోతే మీరు ఫ్యాక్షన్ ని సమర్ధించినట్లేననీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. " పోలీసులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఇలాంటి నేర పూరిత రాజకీయాలు ఎక్కువకాలం సాగవు. జనసేన, భాజపా అభ్యర్థులు ధైర్యంగా నిలబడండి," అంటూ పవన్ అభ్యర్థుల వెన్ను తట్టారు. ప్రజలు అందరు తెలుసుకోవాలినామినేషన్ వేయడానికి ఇంత చేస్తే... ఓట్లేయడానికి ముందుకు ఎవరొస్తారు. రాష్ట్రంలో పరిస్థితులకు ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలి అంటూ ఎన్నికల సంఘానికి సూచించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలు నడుపుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ ధోరణి సరిగా లేదు, ప్రజలు ఆలోచించాలి, ఈ అరాచకాలకు ముగింపు పలకాలంటే.... స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడే భాజపా, జనసేన అభ్యర్థులను గెలిపించండంటూ కన్నా లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, మీ నాయకులు డబ్బు, మద్యం పంచరని మీరు హామీ ఇవ్వగలరా, అని కూడా కన్నా వై ఎస్ ఆర్ సి పి నాయకత్వాన్ని ప్రశ్నిచారు. " మీ ఆర్డినెన్స్ తప్పి మీ పార్టీ నేతలే డబ్బు, మద్యం పంచితే మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతారా.," అంటూ జగన్ మోహన్ రెడ్డి ని కన్నా నిలదీశారు. భాజపా, జనసేన కలిసి విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నామని చెప్పిన కన్నా, ప్రజలు అధికార వై ఎస్ ఆర్ సి పి ఆగడాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.