English | Telugu
చిన్నాన్న అలక తీర్చిన చిన్నోడు...
Updated : Mar 12, 2020
ఏంటి బాబాయి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు.. నువ్వు రాజ్యసభ సీటు ఇవ్వలేదు కదా, నీ పార్టీ మీద అలుగుదామనుకుంటున్నాను.... ఇందులో అలిగేదేముంది బాబాయ్... వచ్చే ఏడాది కొత్త ఖాళీలు వస్తాయి గదా అప్పుడు చూద్దాంలే .... అంటూ టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ని, జగన్ మోహన్ రెడ్డి సముదాయించారట. అయినా బాబాయ్ గారి అలక తీరలేదట. పార్టీ నుంచి రాజ్యసభకు తనకు పంపకుండా వేరే వారిని పంపించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు సీటు ఇవ్వకుండా ‘మాగుంట శ్రీనివాసరెడ్డి’కి సీటు ఇస్తున్నప్పుడు తనకు ‘రాజ్యసభ’ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని, దాంతో తాను సిట్టింగ్ సీటు వదులుకుని త్యాగం చేస్తే...ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వలేదని ఆయన చిరాకుపడుతున్నారట. వాస్తవానికి ఈ సారి పార్టీ నుంచి నలుగురికి రాజ్యసభ సీట్లు లభిస్తాయని, తనకు తప్పకుండా సీటు వస్తుందని ‘వై.వి’ ఆఖరు నిమిషం వరకు భరోసా పెట్టుకున్నారు. ఈ మేరకు మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ‘అయోధ్యరామిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి’లకు ఖచ్చితంగా ఇస్తారని, మిగతా రెండు అప్పటి పరిస్థితును బట్టి నిర్ణయం తీసుకుంటారని పలు ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. దీంతో తనకు ఖాయమనే భావనతో అభ్యర్థుల లిస్టు ప్రకటించే రోజు ఉదయమే తన అనుచరులతో ‘వై.వి’ సమావేశమయ్యారు.
‘వై.వి’ కూడా అదే భరోసాతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అభ్యర్థల పేర్లు మీడియాకు ఇచ్చిన తరువాత...ఆయన ఎవరినీ కలవకుండా నేరుగా తన ఇంటికి వచ్చేశారు. అక్కడ గుమికూడిన కార్యకర్తలను కానీ, అభిమానులను కానీ ఆయన పలకరించకుండా ఇంట్లోకి వెళ్లి తన రూమ్‌లోకి వెళ్లిపోయారట. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు తమ నాయకుడికి సీటు రాలేదని, ఆ బాధతో ఆయన ఉన్నారని తెలుసుకుని ఒక్కొక్కొరే అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఇది ఇలా ఉంటే తరువాత ఇంటి నుంచి బయటకు వచ్చిన ‘వై.వి’ టీటీడీ అధికార వాహనం ఎక్కకుండా ప్రైవేట్ వాహనంలో బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆయన అలిగారని అక్కడే ఉన్న కార్యకర్తలు, అభిమానులు చర్చించుకున్నారు. మరోవైపు ‘స్థానిక’ సంస్థల ఎన్నికలకు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాకు ఇన్‌ఛార్జిగా ఉన్న ‘వై.వి’ ఈ ఎన్నికలను పట్టించుకోవడం లేదనే మాట ఆ జిల్లా నాయకుల నుంచి వినిపిస్తోంది. తనకు రాజ్యసభ ఇస్తానని ఇవ్వకపోవడంపై ఆయన అలకపాన్పు ఎక్కారని కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్నారు. మరో వైపు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తరువాత.‘వై.వి’ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదట. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన సమయంలో కానీ, వారు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసే సందర్భంలోనూ ‘వై.వి’ వారితో కలిసి లేరట. అయితేనేమి చిన్నాన్న అలిగితే, ఆయన్ను సముదాయించటానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే రంగం లోకి దిగారంటే మామూలు సంగతి కాదు కదా...! బహుశా రెండు, మూడు రోజుల్లో వై వి సుబ్బారెడ్డి మాములు మనిషి అయిపోతారని, ఈ చిరు అలకలను తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి చాలా సునాయాసంగా అడ్రెస్ చేయగలరని పార్టీ లీడర్లు, క్యాడర్లు చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నారు.